
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి 174 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్జి దారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా తన భూమిలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని తొలగించాలని కోరుతూ కొండపాక మండలం మంగోలు గ్రామానికి చెందిన గజ్జ శంకరయ్య అడిషనల్ కలెక్టర్ కు అర్జీని అందజేశారు. తప్పుడు కుల సర్టిఫికెట్ పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ బుడబుక్కల సంక్షేమ సంఘం నాయకులు అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 65 ఆర్జీలు
మెదక్: ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 65 అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యలను త్వరగా పరిష్కరించాలి
సంగారెడ్డి టౌన్: ప్రజావాణి కార్యక్రమానికి 33 దరఖాస్తులు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ మాధురి తెలిపారు. డీఆర్వో పద్మజా రాణితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు
వేతనాలు ఇప్పించండి
రాయికోడ్: పెండింగ్వేతనాలు చెల్లించాలని కోరుతూ సింగీతం, రాయిపల్లి గ్రామాల జీపీ కార్మికులు కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్డీపీఓ సాయిబాబాకు ఫోన్ చేసి కార్మికులు వేతనాలు రెండు రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగీతం గ్రామ పంచాయతీలో నిధులు లేకుంటే ఇతర గ్రామ పంచాయతీలోనైనా డబ్బులు డ్రా చేసి కార్మికులకు ఇచ్చేలా చూడాలని సూచించారు.