
ఖమ్మం టౌన్, వెలుగు : ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు జరిగే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్ సీ, ఇంటర్ పరీక్షల నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ లో 287 మంది అభ్యర్థులకు ఓపెన్ టెన్త్ పరీక్షలు, రిక్కాబజార్ లోని జీహెచ్ఎస్ లో 254 మంది అభ్యర్థులకు ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో డీఆర్వో పద్మశ్రీ , జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.కళావతి బాయి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కె.రవిబాబు, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి మంగపతిరావు, అధికారులు పాల్గొన్నారు.