నార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టండి : అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ

నార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టండి : అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ

నేలకొండపల్లి, వెలుగు :-  ప్రభుత్వ దవాఖానల్లో ఆపరేషన్లు తగ్గించి నార్మల్​ డెలివరీలపై వైద్య సిబ్బంది దృష్టి సారించాలని అడిషనల్​కలెక్టర్ శ్రీజ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను పరిశీలించి మాట్లాడారు. గర్భిణుల వివరాలను ఆశ వర్కర్లతో సేకరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్కారు దవాఖానల్లో అన్ని వసతులు ఉన్నాయని, వచ్చే గర్భిణులు, రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని, ఎట్టిపరిస్థితుల్లో  ప్రైవేటు హాస్పిటల్స్​కు పంపించవద్దన్నారు.  

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు, ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.   ప్రసూతి తర్వాత శిశువులకు అవసరమైన పరికరాలు, యంత్రాలు, వాటి స్థితిగతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కొన్నేండ్లుగా నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, చెరువుమాధవరం పరిసర గ్రామాలకు సేవలు అందించాల్సిన ప్రైమరీ హెల్త్ సెంటర్  ఒకేచోట సేవలు అందించడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 

చెరువుమాధవరం వైపు మారిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయన్న ఉద్దేశంతో ఆ గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు.   ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.  కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, పంచాయతీ రాజ్ డీఈ టి. వంశీ, వెంకట కృష్ణ, నేలకొండపల్లి మెడికల్ ఆఫీసర్ మంగళ, డాక్టర్ రాజేశ్, డాక్టర్ శ్రావణ్, ఎంపీడీవో ఎర్రయ్య, ఏఈ ప్రసాద్, ఎంపీవో శివ, ఏవో రాధ, పంచాయతీ కార్యదర్శి పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.