- ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
నల్గొండ, వెలుగు: రబీ సీజన్‌లో యూరియా పంపిణీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సూచించారు. ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ’ ద్వారా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యూరియాకు కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఫర్టిలైజర్ బుకింగ్ యాప్” ద్వారా రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా, అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. యూరియా సరఫరా పర్యవేక్షణకు మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
డీలర్లు యాప్‌లో బుక్ చేసిన ఐడీ నెంబర్ ఆధారంగా మాత్రమే యూరియా పంపిణీ చేయాలని, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసి, డూప్లికేషన్ లేకుండా కచ్చితమైన డేటాతో నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
