సీఎంలు చర్చలు జరిపితే .. కేటీఆర్, హరీశ్ కు ఉలికిపాటెందుకు : భుత్వ విప్ ఆది శ్రీనివాస్

సీఎంలు చర్చలు జరిపితే .. కేటీఆర్, హరీశ్ కు ఉలికిపాటెందుకు : భుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: ఢిల్లీలో ఇద్దరు సీఎంలు భేటీ అయితే కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వారు కృష్ణా, గోదావరి జలాలపై చర్చలు జరిపితే మీకు చలిజ్వరం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘బనకచర్ల ఎజెండాలో లేకపోవడంతో చాన్స్ మిస్ అయిందని కుమిలిపోతున్నరా? అసలు మీరు ఇంకెన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ తో బతుకుతారు. ఆనాడు రాయలసీమ వెళ్లి చేపల పులుసు తిని మీ అయ్యలాగ గోదావరి జలాలను రాసిస్తామనుకున్నవా? ప్రగతి భవన్ లో ఆనాటి సీఎం జగన్ కు కృష్ణా జలాలను తాంబూలం ఇచ్చినట్టు మేం చేస్తామని అనుకున్నవారా?’’ అని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో గోదావరి, కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీరు తగ్గినా.. తగ్గేదే లేదని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే మీరేందుకు ఉలికిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ‘‘గతంలో కృష్ణా జలాల విషయంలో 299 టీఎంసీలు చాలని సంతకం చేసి.. తెలంగాణ రైతులను ఇబ్బందులు పెట్టిన మీరు మాకు కబుర్లు చెబుతున్నారా? టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నప్పడే తెలంగాణ ప్రజలతో మీకు పేగుబందం తెగిపోయింది. కమీషన్ల కోసం కాళేశ్వరంను కూలేశ్వరంగా మార్చి.. తెలంగాణను రాబంధుల వలే  దోచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన మీకు మా గురించి మాట్లాడే అర్హత లేదు”అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణను పీక్కుతిన్న కల్వకుంట్ల రాబంధులను ఇప్పటికే ప్రజలు తన్ని తరిమిన విషయం గుర్తుపెట్టుకోవాలని ఆది శ్రీనివాస్​ హితవు పలికారు.