ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల పరిశీలన

ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల పరిశీలన
  •     1,500 ఎకరాల వివరాలు వెల్లడించిన కలెక్టర్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్  ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మంగళవారం కలెక్టరేట్​లో ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బెంగళూరుకు చెందిన ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్  ఉన్నతాధికారులు, రాష్ట్ర సివిల్  ఏవియేషన్  డైరెక్టర్  భరత్ రెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో భూములు పరిశీలించారు. 

మైక్రో లెవెల్  సర్వే నిర్వహించి, రన్‌‌‌‌‌‌‌‌వే విస్తరణతో పాటు సాంకేతిక అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్​ రాజర్షిషా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జాయింట్  యూజర్(డిఫెన్స్, -సివిల్) ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్  ఏర్పాటుకు సంబంధించి భూసేకరణను పారదర్శకంగా చేపడతామని తెలిపారు. సీఎం ఆదేశాలతో భూసేకరణ స్పీడప్​ చేశామని, 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. డిఫెన్స్  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్(ఎయిర్  ట్రైనింగ్  ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్) కోసం 1,500 ఎకరాలు, సివిల్  ఏవియేషన్  రన్‌‌‌‌‌‌‌‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలు అదనంగా కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందని తెలిపారు. 

జియో కో ఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్  నిర్మాణానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలన విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. జాయింట్  యూజర్  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్  భూసేకరణపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చిందని చెప్పారు. అడిషనల్​ కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, ఎస్  రాజేశ్వర్, ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ఉన్నతాధికారులు జేపీ సబర్వాల్, ఎస్జీ హెడ్గే, ఎస్కే రెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్, ల్యాండ్  సర్వే ఏడీ ప్రభాకర్, తహసీల్దార్లు శ్రీనివాస్, గోవింద్  పాల్గొన్నారు.