- ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్
ఆదిలాబాద్, వెలుగు: రెండేండ్ల కాంగ్రెస్ పాలనతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదివారం సంబురాలు చేసుకున్నారు.
జాతీయ జెండాలు, పార్టీ జెండాలతో ర్యాలీగా తరలివచ్చి పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేస్తోందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అభివృద్ధికి తూట్లు పొడిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పని చేస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుందని చెప్పారు. 12 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దేశ ప్రజలకు అన్యాయం చేసిందన్నారు.
ధరలు, నిరుద్యోగం పెరిగిందని, చిన్న వ్యాపారాలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు సాజిత్ ఖాన్, గండ్రత్ సుజాత, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెలా నర్సింగ్ రావు, చరణ్ గౌడ్, శాంతన్ రావు, పరమేశ్వర్, వసీం, ప్రవీణ్, నాయిద్, అమృత్, మల్యాల కరుణాకర్, దౌలత్ రావు పాల్గొన్నారు.
