ఆదిలాబాద్, వెలుగు: జనగణన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక టీటీడీసీ కేంద్రంలో సెన్సస్-2027 పై టెక్నికల్ అసిస్టెంట్లు, చార్జ్ క్లర్కులకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ తొలిసారిగా జరుగుతున్న జనగణన ప్రక్రియ ను పూర్తిగా డిజిటల్ పద్దతిలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఇందుకోసం సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేక యాప్‌లు, పోర్టల్స్ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ కింద మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియను చేపడతారని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పర్యవేక్షకురాలు నలందప్రియ, మాస్టర్ ట్రైనర్లు వినయ్, జగన్, శ్రీహరి పాల్గొన్నారు.
