
- రిమ్స్ లో సేవలపై జిల్లా జడ్జి ఆగ్రహం
- హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: పేద ప్రజలకు అందించే వైద్యసేవలు ఇలాగేనా… ఆర్ఎంపీల కంటే మరీ అధ్వానంగా పరిస్థితి ఉందని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా జడ్జి ఎంజి.ప్రియదర్శిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ హాస్పిటల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్‍ను ప్రారంభించేందుకు శనివారం వచ్చిన ఆమె హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించారు. జ్వర పీడితులు, ఆర్థోపెడిక్ తదితర వార్డులను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వారికందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎమర్జెన్సీ ఓపీ విభాగంలో రెగ్యులర్ డాక్టర్లకు బదులు జూనియర్ డాక్టర్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ల అటెండెన్సు రిజిస్టర్ఏదని ప్రశ్నించగా అరగంట ఆలస్యంగా తీసుకువచ్చారు. రిజిస్టర్లు లేకుండా వైద్యమెలా చేస్తున్నారని డాక్టర్లపై మండిపడ్డారు. అటెండెన్సు రిజిస్టర్‍లో గ్రీన్, రెడ్, బ్లాక్ ఇంకుతో సంతకాలు చేసి ఉండటంపై ఇన్చార్జి సూపరింటెండెంట్ డా.కళ్యాణ్‍రెడ్డిని ప్రశ్నించారు. సంతకాలు ఇప్పుడే చేసినట్లుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో వైద్యసేవలు అధ్వానంగా ఉన్నాయని, డాక్టర్లు అందుబాటులో లేరని పేర్కొన్నారు. రిమ్స్ వైద్యసేవల్లోని లోపాలపై హైకోర్టుకు నివేదిక అందజేస్తామని వెల్లడించారు. ఆమె వెంట డీఎల్‍ఎస్‍ఏ సెక్రటరీ ఉదయ్ భాస్కర్, ఆర్ఎంఓ రాము తదితరులున్నారు.