గంటలో 3.5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

గంటలో 3.5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

హరితహారంలో  భాగంగా  గిన్నిస్ బుక్   ఆఫ్ వరల్డ్  రికార్డ్  కోసం   ట్రై చేస్తున్నారు ఆదిలాబాద్   ఎమ్మెల్యే   జోగు రామన్న. ఈనెల 4న ....గంటలో  మూడున్నర లక్షల మొక్కలు   నాటేందుకు  ఏర్పాట్లు చేశారు.  25 వేల మంది ఇందులో పాల్గొననున్నారు.

హరితహారంలో ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ నేతలు. ఈనెల 4న మూడున్నర లక్షల మొక్కలను గంట లోపే నాటేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న దుర్గా నగర్ మియావాకీ వేదిక కాబోతోంది. ఈ పార్క్ కి ఆనుకొని ఉన్న 110 ఎకరాల అటవీ భూమిలో మొక్కలు నాటబోతున్నారు.పది రోజుల నుంచి పార్క్ లో యంత్రాలతో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతున్నారు. 4న  ఉదయం 10 గంటల నుంచి 11 గంటల ప్రాంతంలో కార్యక్రమం జరగనుంది.ఇందులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు జోగురామన్న అభిమానులు, ప్రజా సంఘాల సభ్యలు మొత్తం 25 వేల మంది  ఇందులో పాల్గొననున్నారు.

దుర్గా నగర్ పట్టణ పార్క్ లో గత ఏడాది హరితహారంలో భాగంగా 56 రకాలకు చెందిన 20 వేల మొక్కలు నాటారు. అందులో 90 శాతం మొక్కలు పెరిగాయని అధికారులు చెప్తున్నారు. అన్ని రకాల మొక్కలు నాటడంతో పాటు వాటి  పరిరక్షణ చర్యలు చేపట్టబోతున్నారు. పార్క్ లో సహజసిద్దమైన మూడు నాలుగు చెరువులున్నాయి. గతంలో ఈ దుర్గానగర్ మొత్తం అటవీ ప్రాంతంగా ఉండేది. కలప స్మగ్లింగ్ తో అడవి తగ్గిపోయింది. ఈ భూమిని చాలామంది ఆక్రమించుకున్నారు.  ఎమ్మెల్యే జోగురామన్న చొరవతో మళ్లీ భూమిని స్వాధీనం చేసుకొని చుట్టూ కంచే వేయించారు. ఇప్పుడు ఖాళీ స్థలంలో  మొక్కలు నాటే కార్యక్రమానికి చేపట్టారు ప్రజాప్రతినిధులు.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా టర్కీ దేశంలో గంట వ్యవధిలో మూడు లక్షల మూడు వేల మొక్కలు నాటిక గిన్నిస్ బుక్ రికార్డ్ ఉంది.  2019 నవంబర్ లో ఈ రికార్డ్ నమోదై ఉంది. ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు ఆదిలాబాద్ లో గంట వ్యవధిలోనే మూడున్నర  లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే గిన్నిస్ బుక్ సంస్థకి సమాచారం అందించారు. అదే రోజు అదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఒక్కొక్క ఇంటికి ఆరు మొక్కల చొప్పున ఏర్పాట్లు చేశారు.

భారీగా మొక్కులు నాటే కార్యక్రమం విజయవంతం అయితే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఆదిలాబాద్ జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందంటున్నారు స్థానిక ప్రజలు.