ఆదిలాబాద్‌లో ఒకే ఛాన్స్‌ సెంటిమెంట్!​

ఆదిలాబాద్‌లో ఒకే ఛాన్స్‌ సెంటిమెంట్!​
  • ‘ఎస్టీ’ రిజర్వుడ్​ తర్వాత  ఏ పార్టీ రెండోసారి గెలవలే..
  • మూడు ఎన్నికల్లో మూడు పార్టీలకు ఛాన్స్​  
  • ‘ఒక్క అవకాశం’ నినాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్
  • బీజేపీలో అంతర్గత విభేదాలు.. 
  • ఉనికి కోసం బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటర్లు ఒక అభ్యర్థికి ఒక్కసారి అవకాశం ఇస్తే మరో దఫా మరొకరికి పట్టం కడుతున్నారు. ఎస్టీ రిజర్వుడ్​గా మారిన తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీకి కూడా రెండోసారి గెలిచే అవకాశం దక్కలేదు. కొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నందున పాత సంప్రదాయమే కొనసాగుతుందా ? లేక చరిత్ర మారుతుందా అన్నది సస్పెన్స్​గా మారింది.

మూడు సార్లు..మూడు పార్టీలు..

ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి 1952లో మొదటిసారి పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. ఫస్ట్‌ ఎంపీగా సోషలిస్ట్​పార్టీకి చెందిన సి.మాధవరెడ్డి గెలిచారు. తర్వాత వరుసగా ఆరు సార్లు కాంగ్రెస్‌ క్యాండిడేట్లు విజయం సాధించారు. 1991 నుంచి 1999 వరకు వరుసగా టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 2004లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌ మధుసూదన్‌రెడ్డి విక్టరీ కొట్టారు. 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్​అయ్యింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరుగగా ఏ పార్టీ కూడా రెండోసారి గెలవలేదు. 2009లో టీడీపీ నుంచి రాథోడ్‌ రమేశ్, 2014 బీఆర్ఎస్ నుంచి గొడం నగేశ్, 2019లో బీజేపీ నుంచి సోయం బాపురావు విజయం సాధించారు. ఒకసారి లంబాడీ, రెండు సార్లు ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన లీడర్లు ఎంపీలుగా గెలుపొందారు. ఈ సారి మాత్రం మూడు పార్టీల నుంచీ ఆదివాసీలు బరిలో ఉండడం ఉత్కంఠ రేపుతోంది.

ఒక్క ఛాన్స్‌ అంటున్న కాంగ్రెస్‌ క్యాండిడేట్‌

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఒక్క ఖానాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జిల్లా చరిత్రలోనే మొదటిసారి కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఓ మహిళకు టికెట్‌ కేటాయించింది. నియోజకవర్గంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడంతో పాటు, ఇన్‌చార్జీగా మంత్రి సీతక్కకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ సారి కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ‘కొంగు చాచి అడుగుతున్నా.. ఆడబిడ్డనైన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ క్యాండిడేట్‌ ఆత్రం సుగుణ ఓటర్లను వేడుకుంటున్నారు. కాంగ్రెస్‌ లీడర్లు సైతం ‘కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం’ అనే నినాదంతో గడగడపకూ తిరుగుతున్నారు. పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వలసలు పెరగడం, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావడంతో ఈ సారి విజయం తమదేనని కాంగ్రెస్‌ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో విభేదాలు

ఆదిలాబాద్‌ బీజేపీ టికెట్‌ను సిట్టింగ్‌ ఎంపీ అయిన సోయం బాపురావుకు కాకుండా బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన గొడం నగేశ్‌కు కేటాయించడంతో ఆ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో బీజేపీ క్యాండిడేట్లు విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ బలం పెరిగింది. కానీ, ఎంపీ క్యాండిడేట్‌ ప్రకటన తర్వాత పార్టీలో జరుగుతున్న గొడవలు నష్టం కలిగించేలా ఉన్నాయని కేడర్‌లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గొడం నగేశ్‌కు టికెట్‌ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్లంతా సైలెంట్‌ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో సైతం అంతంతమాత్రంగానే పాల్గొంటున్నారు. 

బీజేపీ క్యాండిడేట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన రోజునే, ఆ పార్టీ లీడర్‌, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌ సైతం నామినేషన్‌ వేయడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా జనమీకరణ చేయడంలో ఆదిలాబాద్‌ లీడర్లు ఆసక్తి చూపడం లేదంటూ నిర్మల్‌కు చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడి వ్యవహార శైలితో ఆ పార్టీ సీనియర్లు ఇటీవల రాజీనామా చేశారు. సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావు సైతం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ బీఆర్‌ఎస్‌లో, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్‌లో చేరడం పార్లమెంట్‌ ఎన్నికలపై ఎఫెక్ట్ చూపుతుందన్న చర్చ జరుగుతోంది. పార్టీ శ్రేణులు మాత్రం ఆదిలాబాద్‌ పార్లమెంట్ స్థానం బీజేపీదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వలసలతో బీఆర్‌ఎస్‌ కుదేలు

రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారడంతో జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ క్యాండిడేట్లు గెలిచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న ప్రజాప్రతినిధులు, కేడర్‌ మొత్తం కాంగ్రెస్, బీజేపీలోకి జంప్‌ అయ్యారు. నిర్మల్‌లో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వంటి సీనియర్లంతా పార్టీ మారడంతో బీఆర్‌ఎస్‌ ఉనికి కోల్పోయింది. ఆ పార్టీ తరఫున పార్లమెంట్‌ బరిలో ఆత్రం సక్కును నిలిపారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ తన ఉనికి కాపాడుకునేందుకే శ్రమించాల్సి ఉంది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది.