
ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్జిల్లా ఉట్నూర్ జడ్పీటీసీగా గెలుపొందిన చారులత మొన్న జరిగిన జడ్పీ పీఠం ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలిపి ఓటు వేశారు. మరుసటి రోజు ఫిరాయింపులపై హైదరాబాద్లో దీక్షచేస్తున్న భట్టి విక్రమార్కకు మద్దతు తెలిపారు. ఇలా 24 గంటల వ్యవధిలోనే రెండుపార్టీలకు ఆమె షాక్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో చారులతతోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఇద్దరు జడ్పీటీసీలు గెలిచారు. బీజేపీకి ఐదుగురు జడ్పీటీసీలు ఉండడంతో వీరంతా కలిసి అధికార పార్టీ నుంచి ఒక జడ్పీటీసీని లాగి పీఠం దక్కించుకుందామనుకున్నారు. కానీ ఆ వ్యూహం ఫలించలేదు. అధికార పార్టీ వద్ద సరిపడా సభ్యులుండడంతో వారే పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నిక సమయంలో కాంగ్రెస్పార్టీ జడ్పీటీసీ చారులత ఒంటరిగా జడ్పీ సమావేశ మందిరానికి వచ్చి టీఆర్ఎస్కు ఓటు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చెప్పాలంటే చారులత వేసిన ఓటు టీఆర్ఎస్ పార్టీకి అదనమే.
టీఆర్ఎస్ వైపా.. కాంగ్రెస్ లోనేనా?
తెలంగాణలో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం చూసి ఆకర్షితురాలైన చారులత తనంతట తానే నేరుగా సమావేశ మందిరానికి వచ్చి టీఆర్ఎస్ పార్టీ జడ్పీ పీఠం అభ్యర్థికి మద్దతు తెలిపారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. దాంతో చారులత ఇకమీదట టీఆర్ఎస్ పార్టీతోపాటే నడుస్తుందని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపును నిరసిస్తూ హైదరాబాద్లో మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన దీక్షకు ఆదివారం ఆమె వెళ్లి తన సంపూర్ణ మద్దతు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 24 గంటల్లోనే ఉట్నూర్ జడ్పీటీసీ చారులత వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అయోమయానికి గురయ్యారు.