గుడిసెల తొలగింపుపై మహిళల ఆందోళన

గుడిసెల తొలగింపుపై మహిళల ఆందోళన

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో 20 ఏళ్ల కిందట పేదలకు కేటాయించిన 142 సర్వే నంబర్ భూమిని సర్కార్ తిరిగి అన్యాయంగా లాక్కుంటోందని గ్రామస్తులు వాపోయారు. ఈ భూమిలో పార్కు ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలు విరమించుకోవాలంటూ మూడు నెలల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ గుడిసెలు వేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున పేదల గుడిసెలను తొలగించి అక్కడ ఉంటున్న పలువురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని స్టేషన్​కు తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ డిస్ట్రిక్ట్  ప్రెసిడెంట్ పాయల్ శంకర్ ఆదిలాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి మహిళలను పరామర్శించారు.

అనంతరం మహిళలను విడిచిపెట్టగా బీజేపీ నేతలతో పాటు దళిత శక్తి ప్రోగ్రాం స్టేట్ వైస్ ​ప్రెసిడెంట్ అగ్గిమల్ల గణేశ్ తో కలిసి టెక్నికల్ ​ట్రైనింగ్​ డెవలప్​మెంట్​ సెంటర్ (​టీటీడీసీ) వద్ద కలెక్టర్ కాన్వాయ్ ముందు బైఠాయించారు. తమ భూమిలో రెవెన్యూ అధికారులు బోర్డులు పాతారని, వాటిని తొలగించాలని, మహిళలని చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. అధికార పార్టీ నేతల కోసమే భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. భూమిలో పల్లె ప్రకృతివనం నిర్మాణం ఆపి అర్హులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. టీటీడీసీలో ఆందోళనకు దిగడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్​వారికి సర్దిచెప్పారు. ఉన్నతాధికారులను పంపించి విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.