అప్పిచ్చిన డబ్బులు అడిగిందని హత్య చేసిండ్రు..వివరాలు వెల్లడించిన ఎస్పీ

అప్పిచ్చిన డబ్బులు అడిగిందని హత్య చేసిండ్రు..వివరాలు వెల్లడించిన ఎస్పీ
  •  ఇద్దరు అరెస్ట్, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్, వెలుగు : అప్పిచ్చిన డబ్బులు అడిగిందని ఓ మహిళను హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. గురువారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ కాలనీకి చెందిన మహిళ ఇమ్రానా జబీన్ (39) నవంబర్ 26 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మావల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని సీఐ స్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఇంద్రవెల్లికి చెందిన ఫారూఖ్ ఖాన్, మృతురాలు గతంలో ఒకే కాలేజీలో చదువుకున్నారు.

 ఈ పరిచయంతో ఆమె వద్ద నుంచి 2024 జనవరిలో రూ.8 లక్షలు, 8.5 తులాల బంగారాన్ని ఫారూఖ్​ఖాన్ అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత తన సొంత అవసరాల నిమిత్తం ఆమె డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగింది. దీంతో ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు ఇష్టపడని ఫారూఖ్ ఖాన్, అతడి డ్రైవర్ బస్సి రమేశ్​తో కలిసి హత్యకు కుట్ర పన్నాడు. నిందితులు ఇద్దరు కలిసి గతేడాది నవంబర్ 26న పిట్టలవాడలో ఉన్న ఆమె ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. అనంతరం రాత్రి ఒటిగంటకు మృతదేహాన్ని అద్దెకి తీసుకున్న కారులో మహారాష్ట్రలోని సర్కానీ ఘాట్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు కల్వర్టు సమీపంలో గుంతలో పూడ్చిపెట్టారు. 

జనవరి 14న ఆదిలాబాద్ పట్టణంలోని తిరుమల పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్​చేసి విచారించడంతో అసలు విషయం బయటపడింది. వారి వద్ద నుంచి రెండు మొబైల్​ఫోన్స్​స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు. నిందితుల ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.