ఆదిపురుష్ రివ్యూ : అంచనాలను అందుకో లేకపోయిందా?

ఆదిపురుష్ రివ్యూ : అంచనాలను అందుకో లేకపోయిందా?

భారీ బడ్జెట్..  భారీ అంచనాలు... మరో వైపు పాన్ ఇండియా స్టార్.. వీటన్నిటి నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ప్రభాస్ ఆదిపురుష్. థియేటర్స్ అన్నీ.. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. కథా పరంగా అందరికీ తెలిసిన రామాయణమే అయినా.. సినిమాలో కొత్తదనం ఉందా?  ప్రభాస్ రాముడు పాత్రలో ఎలా ఉన్నాడు? అనేది ఈ రివ్యూ లో చూద్దాం

కథ: ఆది పురుష్.. అందరికీ తెలిసిన కథే అయినా.. నేటి తరానికి అర్థం అయ్యేలా తెరపై కొత్తగా ఆవిష్కరించారు  డైరక్టర్ ఓం రౌత్. కథ విషయానికి వస్తే.. రాముడు, సీత, లక్ష్మణుడు  వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడిని చూసి శూర్పణఖ మనసు పడుతుంది. అయితే తాను వివాహితుడినని శ్రీరాముడు శూర్పణఖ కోరికను తిరస్కరిస్తాడు. దాంతో సీతపై హత్యా ప్రయత్నం చేయబోయిన శూర్ఫణఖ ముక్కును కోసేస్తాడు. తన చెల్లిలికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రావణుడు సీతను అపహరిస్తాడు. లంకలో బంధించి పెళ్లాడమని వేధిస్తుంటాడు. సీతా అపహరణ తర్వాత శ్రీరామచంద్రుడు ఎలాంటి వేదనకు గురయ్యాడు? సీత ఆచూకీ తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాడు? సీత ఆచూకీని వానరులు చెప్పిన తర్వాత లంక ప్రయాణం ఎలా సాగింది.? లంకను చేరుకోవడానికి రామసేతు నిర్మాణం ఎలా జరిగింది? శ్రీరాముడు, వానర సైన్యంపై రావణసురుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు ఎలా మాయలు చేసి ముప్పు తిప్పలు పెట్టారు. రావణ సంహారం ఎలా జరిగింది? ఇదే ఆదిపురుష్ సినిమా.

నటీనటులు: శ్రీరాముడిగా కొత్త లుక్‌లో ప్రభాస్ కనిపించాడు. బాహుబలి సినిమాలో రాజుగా మెప్పించిన ప్రభాస్.. ఆడపురుష్ లో శ్రీరాముడిగా అద్బుతంగా కనిపించాడు. సీతగా కృతిసనన్‌కు పెద్దగా ఫెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేకపోయింది. ఇక ఈ సినిమాలో పూర్తిగా డామినేట్ చేసినది రావణుడిగా సైఫ్ ఆలీఖాన్. లంకేశ్వరుడిగా సైఫ్ నటన ఆకట్టుకుంది. సైఫ్ ఆహార్యం, హావభావాలు కొత్తగా ఉన్నాయి. మండోదరిగా సొనాల్ చౌహాన్, శూర్పణఖగా తృప్తి తొడర్‌మల్, హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ ఫర్వాలేదనిపించారు. 

విశ్లేషణ: దర్శకుడు ఓం రౌత్ సినిమాను టెక్నికల్‌గా బాగా డీల్ చేశాడనే చెప్పాలి. కాకపోతే తెలిసిన కథ అవ్వడం తో..  కథలో ఎక్సైట్‌మెంట్ లేదు. సినిమాకి గ్రాఫిక్స్ హైలెట్ గా నిలిచింది. సెకండాఫ్‌లో రామసేతు నిర్మాణం సమయంలో సముద్రుడు, రాముడు మధ్య నడిచే సీన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడితో పోరాటాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు. రాముడు, రావణుడు తొలిసారి కలుసుకొనే సీన్ కూడా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. టెక్నికల్‌గా సినిమాను హైలెట్ గా నిలిచింది. 

సాంకేతిక విభాగం: ఆదిపురుష్ సినిమాకు మొత్తంగా ప్రాణం పోసింది మ్యూజిక్. అజయ్ అతుల్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అత్యంత బలమైన అంశంగా మారింది. ఇక వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్‌కు మించి ఉన్నాయని చెప్పవచ్చు. చాలా చోట్ల 3డీ ఎఫెక్ట్స్ థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి. సినిమాటోగ్రఫి విజువల్ ఫీస్ట్‌గా అనిపిస్తుంది. 

ఇక మొత్తంగా.. కథపై కంటే టెక్నికల్‌ అంశాలపైనే దృష్టిపెట్టడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే రామాయణాన్ని క్రియేటివ్ లిబర్టిని వాడుకొని నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మోడర్న్‌గా, టెక్నికల్‌గా చెప్పిన విధానం బాగా అనిపిస్తుంది.  ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఇప్పటికే విజయం సాధించింది. రానున్న రోజుల్లో వచ్చే వసూళ్లు ఈ సినిమా రేంజ్‌ను మరింత పెంచుతుంది.