సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనంటూ బీజేపీతో వాదులాడుతున్న శివసేన తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు నవంబర్ 8 డెడ్లైన్(ఆ రోజుతో గత అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది) కావడంతో థాక్రే ఫ్యామిలీపై ఒత్తిడి పెరుగుతున్నది. గురువారం ముంబైలో శివసేన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. సేన శాసనసభాపక్ష నేతగా ఆదిత్య థాక్రేను ఎన్నుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే ప్రకటన చేస్తారని శివసేన వర్గాలు తెలిపాయి. ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉద్ధవ్ థాక్రేను కలిసి మద్దతు తెలపడంతో శివసేన సంఖ్యాబలం 62కు పెరిగింది.
