కర్రలతో కొట్టుకున్న ఆదివాసీలు, బంజారాలు

కర్రలతో కొట్టుకున్న ఆదివాసీలు, బంజారాలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఉయ్యాలవాడ బాడువలో భూ వివాదం నేపథ్యంలో ఆదివాసీలు, బంజారాలు కర్రలతో కొట్టుకున్నారు. ఉయ్యాలవాడ బాడువపై బంజారాలు దాడి చేశారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన వారు గాయపడ్డారు.  

జరిగింది ఇది..

ఆదివాసీ గ్రామాలైన ఉయ్యాలవాడ బాడువ, మోకాళ్ల గుంపు..బంజారా గ్రామాలైన పెద్దతండా, హర్యాతండా, కాల్వతండా గ్రామాల మధ్య కొంత కాలంగా భూ వివాదం రగులుతోంది. 123తో పాటు అనుబంధ సర్వే నెంబర్లలోని 70 ఎకరాల భూమి తమదంటే తమదంటూ ఇరు పక్షాలు గొడవ పడుతున్నాయి. 70 ఎకరాల్లో 40 ఎకరాల భూమిని తమ తాతలకు ఆదివాసీలు అమ్మారంటూ బంజారాలు చెబుతుండగా, అమ్మింది కొంతయితే దొంగ సంతకాలతో మిగిలింది బంజారాలు ఆక్రమించుకున్నారంటూ ఆదివాసీలు పేర్కొంటున్నారు. 

లొల్లి పెంచిన ధరణి

ధరణిలో పట్టేదార్​కాలంలో ఆదివాసీలుండగా, దశాబ్దాల కాలంగా అనుభవదారులుగా బంజారాలున్నారు. అనుభవదారుల కాలాన్ని ధరణి పోర్టల్ ​నుంచి తొలగించడంతో లొల్లి ముదిరింది. ఆన్​లైన్ ​పహణీలేమో బంజారాల వద్ద ఉన్నాయి. ల్యాండ్ ​స్టేటస్ ​చూస్తే పట్టేదారు భూమి అమ్ముకున్నట్టుగా ఉంది. కానీ అమ్మిన వారి పేర్లు లేకపోవడంతో పరిష్కారం దొరకలేదు. దీంతో రెండు వర్గాలు భూమి తమదంటే తమదంటూ గొడవ పడుతున్నారు.  

సెటిల్​మెంట్​ పేరిట ఆజ్యం పోసిన్రు

కొన్ని నెలల కింద కొందరు అధికార పార్టీ లీడర్లతో పాటు మండల స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు ల్యాండ్ సెటిల్​మెంట్​ చేస్తామని  మధ్యలోకి ఎంటరయ్యారు. ఎకరానికి రూ. 60వేలు ఇచ్చేలా ఒప్పందం కూడా చేశారు.  తమ వాటాల విషయం తేల్చకపోవడంతో ఇరు పక్షాలను రెచ్చగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ముదిరిన వివాదం..కొట్టుకున్న రెండు వర్గాలు 

లీడర్ల తీరుతో రెండు నెలల కిందట ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. పోలీస్​ స్టేషన్లలో కేసులు కూడా పెట్టుకున్నారు. గ్రీవెన్స్​లో కలెక్టర్​ను కలిసి విన్నవించుకున్నారు.  అయినా ఎవరూ సమస్య పరిష్కరించలేదు. ప్రస్తుతం దుక్కులు దున్నడం, నాట్లు వేస్తున్న క్రమంలో ఇరుపక్షాలకు చెందిన రైతులు మంగళవారం భూముల వద్దకు చేరుకున్నారు. మాటా మాటా పెరగడంతో కర్రలతో దాడులు చేసుకున్నారు. ఆదివాసీల గ్రామమైన ఉయ్యాలవాడ బాడువ గ్రామంపై బంజారాలు దాడి చేశారు. పలు ఇండ్లతో పాటు రెండు ఆటోలు, మూడు మోటార్​ బైక్​లను ధ్వంసం చేశారు. ఉయ్యాలవాడబాడువ, మోకాళ్ల గుంపు గ్రామాల్లోని అంగన్​వాడీకేంద్రంతో పాటు గవర్నమెంట్​స్కూల్​లో ఆదివాసీలు దాక్కున్నారనే సమాచారంతో స్కూళ్లపై దాడి చేశారు. అయితే ఆదివాసీలే గొడవకు కారణమని, అన్యాయంగా తమపై దాడి చేశారంటూ బంజారాలు చెబుతున్నారు. ఇరుపక్షాలకు సర్ది చెప్పే క్రమంలో లక్ష్మీదేవిపల్లి పోలీసులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన రెండు వర్గాల వారు కొత్తగూడెంలోని జిల్లా హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. గొడవలతో ఆయా గ్రామాల్లో 144 సెక్షన్​ విధించారు. ఉయ్యాలవాడబాడువ సమీపంలో పోలీస్ ​పికెటింగ్​  ఏర్పాటు చేశారు.