ఏటూరునాగారం, వెలుగు : బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పూనెం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఏటూరునాగారంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఐటీడీఏను ముట్టడించారు. ఈ సందర్భంగా పూనెం శ్రీనివాస్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ... 1976లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం లేకుండా అసెంబ్లీ, లోక్‌సభలో చర్చించకుండానే గెజిట్ విడుదల చేయడంతో నిజమైన ఆదివాసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు బంజారాలకు వెళ్లాయని చెప్పారు.
బంజారాలకు ఎస్టీ రిజర్వేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ... ఈ నెల 24న ఉట్నూర్ ఐటీడీఏ, డిసెంబర్ 15న మన్ననూరు ఐటీడీఏ, డిసెంబర్ 29న భద్రాచలం ఐటీడీఏ ఆఫీస్‌ను ముట్టడించనున్నట్లు ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోతే ఎమ్మెల్యేల ఇండ్లను సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్లు ఉకే రవి, పాయం సత్యనారాయణ, వాసం రామకృష్ణ దొర, కురుస నరసింహమూర్తి, సోయం కామరాజు, కో -చైర్మన్లు పూనెం రామచంద్రు, ముర్రం వీరభద్రం, వాసం నాగరాజు, కల్తీ కుమారస్వామి, చింత సర్వేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈసాల సురేశ్ పాల్గొన్నారు.
