రోడ్డు లేక భద్రాద్రి జిల్లా కరకగూడెంలో ఆదివాసీల అవస్థ

రోడ్డు లేక భద్రాద్రి జిల్లా కరకగూడెంలో ఆదివాసీల అవస్థ

భద్రాద్రికొత్తగూడెం / గుండాల, వెలుగు: ఇప్పటికీ రోడ్డు సౌలత్ లేక ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వదలని వాన, రోడ్డు లేక, వెహికల్ రాక నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని కుటుంబ సభ్యులే డోలీ కట్టుకొని కిలోమీటరు దూరానికి పైగా మోసుకుంటూ వెళ్లి అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన గర్భిణి ముసికి దేవికి సోమవారం పొద్దున నొప్పులు మొదలయ్యాయి. వాన పడుతుండడం, గ్రామానికి రోడ్డు కూడా లేకపోవడంతో భర్త నందయ్య 108 అంబులెన్స్​కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ గ్రామానికి కిలోమీటర్ దూరంలో రోడ్డు వరకు వచ్చి ఆగింది. దీంతో నందయ్య, ఆయన కుటుంబసభ్యులు కుర్చీతో డోలీ కట్టి అందులో ఆమెను కూర్చోబెట్టి దాదాపు కిలోమీటర్ దూరం బురద దారిలో మోసుకుంటూ అంబులెన్స్ దగ్గరకు వచ్చారు. అంబులెన్స్​లో ఆమెను కరకగూడెం పీహెచ్​సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం కొత్తగూడెంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.