కృష్ణా వివాదంపై మీటింగ్ వాయిదా

కృష్ణా వివాదంపై మీటింగ్ వాయిదా

హైదరాబాద్, వెలుగు : నాగార్జున సాగర్​ప్రాజెక్టుపై వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ శనివారం తలపెట్టిన సమావేశాన్ని ఈ నెల ఆరో తేదీకి వాయిదా వేశారు. నవంబర్​29న రాత్రి ఏపీ పోలీసులు ఏకపక్షంగా నాగార్జునసాగర్​పైకి చొచ్చుకువచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కుడి కాలువ హెడ్​రెగ్యులేటర్​గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ఉండటంతో ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. 

ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎస్​లు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. నాగార్జున సాగర్​పై సీఆర్పీఎఫ్ ​బలగాలతో పహారా ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. దీనికి కొనసాగింపుగా కేంద్ర జలశక్తి శాఖ శనివారం రెండు రాష్ట్రాలతో వర్చువల్​గా సమావేశం ఏర్పాటు చేసింది.

 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని, ఆదివారం (3వ తేదీన) ఓట్ల లెక్కింపు, సోమవారం (4వ తేదీన) కేబినెట్​సమావేశం ఉన్నందున మీటింగ్ ఈనెల 5వ తేదీన లేదా మరో రోజుకు​వాయిదా వేయాలని తెలంగాణ సీఎస్​శాంతి కుమారి శనివారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు.

ఏపీ తాగునీటి ఇండెంట్ పై 4న నిర్ణయం

ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ​ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపకంపై తగిన నిర్ణయం తీసుకొని వివాదాలు పరిష్కరించేందుకు కేంద్ర  ప్రభుత్వం సిద్ధంగా ఉందని దేబశ్రీ ముఖర్జీ ప్రకటించారు. ఏపీ సీఎస్​ జవహర్​రెడ్డి సాగర్​ వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలోని 
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరిస్తున్నదని, తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీళ్లు విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. అందుకే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. 6వ తేదీన నిర్వహించే సమావేశంలో దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. జలశక్తి శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, తెలంగాణ విజ్ఞప్తి మేరకు సమావేశం ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఆ రోజు వరకు నాగార్జున సాగర్​విషయంలో రెండు రాష్ట్రాలు సంయమనం పాటించాలని సూచించారు. 

ఏపీ తాగునీటి కోసం ఇచ్చిన ఇండెంట్​పై 4వ తేదీన కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు చైర్మన్​శివ్​నందన్​కుమార్​ను ఆదేశించారు. అప్పటి వరకు సాగర్​కుడి కాలువ నుంచి నీటి విడుదల ఆపేయాలన్నారు. 6న నిర్వహించే సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్​లు సహా ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి రావాలని కోరుతూ శనివారం సాయంత్రం లేఖ రాశారు. ఈ సమావేశంలో నాగార్జున సాగర్​పై తలెత్తిన వివాదంతో పాటు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్​బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించడం సహా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఇతర వివాదాలపైనా చర్చించనున్నారు. 

సాగర్​ నుంచి ఏపీ పోలీసులు వెళ్లేలా చర్యలు చేపట్టండి

సాగర్ ​డ్యామ్​పై నుంచి ఏపీ పోలీసులు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. శనివారం ఇరిగేషన్ ​ఈఎన్సీ మురళీధర్ ​కేఆర్ఎంబీ చైర్మన్ ​శివ్​నందన్​కుమార్​కు లేఖ రాశారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నవంబర్ 28కు ముందున్న పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని, ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్​ పహారా ఏర్పాటు చేసేందుకు కూడా ఓకే చెప్పాయని గుర్తుచేశారు. అయినా డ్యామ్​పై ఏపీ పోలీసులు ఉన్నారని, సీఆర్పీఎఫ్​బలగాలు డ్యామ్ రక్షణ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఏపీ పోలీసులు కుడి కాలువ హెడ్​ రెగ్యులేటర్​గేట్లు తెరిచి ఉంచి నీటిని తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

స్టేటస్​కో కొనసాగించేందుకు రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నందున ఏపీని కట్టడి చేయాలని బోర్డును కోరారు. ఏపీలో పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొన్నందున 5 టీఎంసీలు విడుదల చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి శనివారం కేఆర్ఎంబీకి లేఖ రాశారు. తమ రాష్ట్రానికి చేసిన కేటాయిం పుల్లో 16.97 టీఎంసీల్లో 5 టీఎంసీలు తీసుకునేం దుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.