- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
- గురుకుల ఎంట్రన్స్ ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో సీట్ల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం మాసాబ్‌ట్యాంక్ సంక్షేమ భవన్‌లో గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడారు. సీట్లు ఇప్పిస్తామంటూ చెప్పే దళారులను నమ్మవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పెండింగ్ వేతన సమస్యలపై ఆర్థిక శాఖతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కార్మిక చట్టాల ప్రకారం వేతనాలను క్రమబద్ధీకరిస్తామన్నారు. ప్రస్తుతం గురుకులాల అద్దెబకాయిలు ప్రతిమూడు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నామని, వచ్చే నెల నుంచి ప్రతి నెల 7వ తేదీ లోపు రిలీజ్ చేస్తామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. విద్యార్థులకు ఏ స్కూల్‌లో సీటు కేటాయించారో, అదే స్కూల్‌లో వెరిఫికేషన్ నిర్వహించాలని తెలిపారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు హైదరాబాద్ రానక్కర్లేకుండా, జిల్లా కలెక్టరేట్లలో నోడల్ ఆఫీసర్లను నియమిస్తామని పేర్కొన్నారు. గురుకులాల్లో కిచెన్ల ఆధునీకరణ కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్టు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
మొత్తం 635 గురుకులాల్లో 5వ తరగతికి సంబంధించి 51,284 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,72,913 మంది (95%) అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొదటి విడతలో భాగంగా 47,381 మందికి సీట్లు కేటాయించారు. ముగ్గురు విద్యార్థులు 100కు 98 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. సీట్లు దక్కిన స్టూడెంట్స్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15వరకు వాళ్లకు కేటాయించిన స్కూల్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అటెండ్ కావాలని అధికారులు కోరారు.
అనంతరం ఎస్టీ గురుకుల కార్యాలయంలో డిగ్రీ విద్యార్థులకు మంత్రి ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సైదులు, సీతాలక్ష్మి, డైరెక్టర్ సంతోష్, అధికారులు గీత, సక్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.
