- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు రావాలని ఆహ్వానం
- పంజాబ్ ఆర్థిక మంత్రికీ ఇన్విటేషన్ అందజేత
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2025కు అటెండ్ అవ్వాలని హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. సమిట్ ప్రాముఖ్యత, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి పథం, పెట్టుబడుల అవకాశాలు, రాష్ట్రాల మధ్య సహకార వేదిక వంటి కీలక అంశాలపై సీఎంకు మంత్రి వివరించారు. రాష్ట్ర పెట్టుబడుల వాతావరణం, టీఎస్ ఐపాస్ ద్వారా వేగవంతమైన అనుమతులు, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న విధానం, ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతి గురించి తెలియజేశారు.
ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న సమిట్‌కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో నిలుస్తోందని ఈ సందర్భంగా హర్యానా సీఎం ప్రశంసించారు. అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విదేశీ పర్యటనలో ఉండటంతో, ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హర్పల్ సింగ్ ను కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా పంజాబ్–తెలంగాణ మధ్య వ్యవసాయ ప్రాసెసింగ్, అగ్రిటెక్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్ సహకారాలు, పర్యాటక–సాంస్కృతిక మార్పిడి, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురు మంత్రులు చర్చించారు.
