సీఎం కేసీఆర్ కు అడ్మినిస్ట్రేషన్ రాదు: విజయశాంతి

సీఎం కేసీఆర్ కు అడ్మినిస్ట్రేషన్ రాదు: విజయశాంతి

ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి వారం గడిచినా సీఎం కేసీఆర్ మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజిలో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై… వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి… కేసీఆర్ కు అడ్మినిస్ట్రేషన్ రాదన్నారు. రైతుల విషయం తీసుకున్నా… ఇంతకు ముందు ఎంసెట్ లీకేజి విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. మొదటి రోజు ఆ విషయంపై  మాట్లాడతారు… రెండో రోజు దాన్ని డైవర్ట్ చేస్తారని ఆరోపించారు. ఇంతగా విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే ఒక్క రోజు మాత్రమే దీనిపై మాట్లాడి… తర్వాత దాన్ని పట్టించుకోరన్నారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వీరికి పాలన చేత కాదని.. ఇది దోపిడీ ప్రభుత్వమని విమర్శించారు. ప్రజలను చంపడానికే ఈ ప్రభుత్వం వచ్చిందని అనుకుంటున్నామన్నారు.

కేసీఆర్ కు సీఎం గా కొనసాగే అర్హత లేదన్న విజయశాంతి… ముందు ఆ కుర్చీ నుంచి ఆయన దిగిపోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు చెందిన మంత్రిని సస్పెండ్ చేయకపోగా… అతని పై ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు చనిపోవడం అనేది అపోహలని మంత్రి అనడం… దారుణమన్నారు.

బ్లాక్ లిస్టులో ఉన్న గ్లోబరినా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు విజయశాంతి. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని అన్నారు. విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ తగిన న్యాయం చేయాలని… లేదంటే సీఎం క్యాంప్ ఆఫీసు ముందే విద్యార్థులతో ఉద్యమం చేస్తామని హెచ్చిరించారు విజయశాంతి.