ఒకటి గొని, రెంటి నిశ్చలయుక్తి చేర్చి,
మూటి నాల్గింట కడునవశ్యములుగ చేసి
యేనిటిని గెల్చి, యారింటినెరింగి యేడు
విడిచి వర్తించువాడు వివేకధనుడు
(తిక్కన, మహాభారతం)
‘ఒక అధికారాన్ని చేపట్టినవాడు తన అధికార పీఠాన్ని నిలుపుకోవాలంటే పరిపాలకుడు వివేక ధనుడు కావాల’ని అన్నాడు విదురుడు. పరిపాలకులకు ఈ పద్యం రాజనీతిని నేర్పుతుంది. ఈ చిన్న పద్యంలో ఇమిడి ఉన్న గొప్ప అర్థాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ అంశాలను కొంత వివరణాత్మకంగా తెలుసుకుందాం. . !
అధికారాన్ని చేపట్టినవారు ఉత్సాహంగా పనిచేయాలి. దానితోపాటు మంత్రుల మంత్రాంగం చాలా అవసరం. ఈ రెండూ కలిస్తేనే పరిపాలన సంపూర్ణంగా జరుగుతుంది. పరిపాలకుని కార్యవర్గంలో.. మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాలవారు ఉంటారు. వారిని... సామము, దానము, భేదము, దండము అనే నాలుగు ఉపాయాలతో తన అధీనంలో ఉంచుకోవాలి. అక్కడితో సరిపోదు. పంచేంద్రియాలకు లోనుకాకూడదు. వాటిని జయించాలి. అలాగే ఆరు గుణాలను అలవరచుకోవాలి.
- శత్రువు బాగా బలవంతుడైతే కనుక వానితో సంధి చేసుకుని మిత్రుడిగా మార్చుకోవాలి.
- శత్రువుతో యుద్ధం చేయగలిగే శక్తి ఉంటే యుద్ధం చేసి వశపరచుకోవాలి.
- ఇక మూడోది యానం... అంటే దండయాత్ర. కొన్ని రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకోవడానికి రాజులు దండయాత్రలు చేయవలసిన అవసరం ఉంది. రాజసూయ యాగం చేయడానికి ముందు ధర్మరాజు అనుజ్ఞ మేరకు నలుగురు తమ్ముళ్లు నాలుగు దిక్కులకు వెళ్లి, దండయాత్రలు చేసి, ఆ రాజులను జయించి తమకు సామంతులుగా చేసుకున్నారు.
- నాలుగవది ఆసనం. ..దేశ కాల పరిస్థితులను బట్టి ఉపేక్ష వహించాలి. అంటే కొన్నిసార్లు పొరుగు దేశాల వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారి పట్ల ఉపేక్ష వహించి, వారి నుంచి స్వదేశాన్ని కాపాడుకోవాలి.
- ఐదవది ద్వైది. అంటే బలవంతులైన ఇద్దరు శత్రువులను ఎదుర్కోవలసి వచ్చినపుడు ఒకరికి తెలియకుండా ఒకరితో సంధి చేసుకొని వారిలో వారికి వైరం కలిగేలా చేయటం. దానినే ‘విభజించి పాలించు’ అంటారు. అలా చేయడం ద్వారా ఇద్దరినీ సులువుగా జయించి, శత్రుశేషం లేకుండా చేసుకోవచ్చు. ఈ విధానాన్నే ఆంగ్లేయులు అవలంబించి, భారతదేశాన్ని పరిపాలించారని చరిత్ర చెబుతోంది.
- ఇక చివరిది ఆరోది ఆశ్రయం. అంటే.. మనం బలం కోల్పోతున్నామని తెలుసుకున్నప్పుడు, బలవంతుని సహాయం తీసుకోవడం.
ఈ ఆరు గుణాలు రాజులకు అవసరం. రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించటానికి సమయానుసారంగా అనుసరించాలి అని విదురుడు చెప్తున్నాడు. ప్రభువు పదికాలాల పాటు పదవిలో కొనసాగాలంటే సప్త వ్యసనాలను తప్పనిసరిగా విడిచిపెట్టాలి. లేదంటే ప్రజలే ఆ ప్రభువు మీద తిరుగుబాటు చేసి, పదవి నుండి తొలగిస్తారు.
పాలకులు వదలాల్సిన వ్యసనాలు..!
- మొదటిది వేట. వేట కారణంగానే పాండురాజు, దశరథుడు శాపగ్రస్తులయ్యారు.
- రెండవది.. జూదం ఆడి ధర్మరాజు, నలుడు ఇక్కట్లపాలయ్యారు.
- మూడవదైన మద్యపానం ద్వారా కీచకుడు జీవితం కోల్పోయాడు.
- నాలుగోది స్త్రీ వ్యామోహం. దీని కారణంగా సకల వేదపారంగతుడైన రావణుడు తాను మరణించడమే కాకుండా, వంశ నాశనానికి కారకుడయ్యాడు.
- ఇక ఐదవదైన పరుష వాక్కుల కారణంగానే శిశుపాలుడు శ్రీకృష్ణుని చక్రాయుధానికి బలయ్యాడు.
- ఆరోది దండ పారుష్యం.. అనగా చిన్న తప్పుకు పెద్ద శిక్షలు విధించడం. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని అనుకోకుండా రాజ కుమార్తె శర్మిష్ఠ బట్టలు ధరించిన కారణంగా శర్మిష్ఠ కోపించి దేవయానిని నిందించింది. ఆ కోపంతో దేవయాని అలిగి తండ్రికి చెప్పి శర్మిష్ఠను దాసిగా చేసుకుంది.
- ఏడవది చివరది అర్థదూషణం.. అంటే ధనాన్ని వృథా చేయడం. ఇది నేటికీ మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ధనాన్ని వృథా చేయడం ద్వారా ప్రభుత్వాలు అప్పుల పాలవుతాయి. అందువల్ల ప్రజలంతా బాధలకు గురి కావలసి వస్తుంది. అప్పుడు ప్రజలలో తిరుగుబాటు బయలుదేరి, పరిపాలకులను పదవీచ్యుతులను చేస్తారు.
అందువల్ల ఈ ఏడు వ్యసనాలను విడిచి ప్రవర్తించేవాడు యుక్తాయుక్తాలు తెలిసినవాడని విదురుడు చెప్తున్నాడు.
–డా.పురాణపండ జయంతి–
