మూసీ ఫేజ్1కు పరిపాలనా అనుమతులు.. జోన్-1ఏ, జోన్-1బీ పనులకు రూ.7,345 కోట్లు

మూసీ ఫేజ్1కు పరిపాలనా అనుమతులు.. జోన్-1ఏ, జోన్-1బీ పనులకు రూ.7,345 కోట్లు
  • ఉత్తర్వులు జారీచేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
  • ఏడీబీ నుంచి 4,500 కోట్లు లోన్.. 
  • 2,845 కోట్లు ప్రభుత్వ గ్రాంట్స్​
  • 21 కిలో మీటర్ల మేర సాగనున్న తొలి విడత పనులు

హైదరాబాద్, వెలుగు: మూసీ నదికి పునరుజ్జీవం పోసే బృహత్తర ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మూసీ రివర్‌‌ఫ్రంట్ డెవలప్‌‌మెంట్ ప్రాజెక్టు పరిధిలోని 'జోన్-1ఏ, జోన్-1బీ' ప్రాధాన్యతా ప్రాంతాల పనుల నిమిత్తం రూ.7,345.12 కోట్లకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గురువారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులలో రూ.4,500 కోట్లను అంతర్జాతీయ సంస్థ అయిన ఆసియా డెవలప్‌‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రుణం రూపంలో సేకరించనుండగా.. మిగిలిన రూ.2,845 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా.. హెచ్‌‌ఎండీఏ, టీజీఐఐసీ నుంచి సమకూర్చనుంది. హిమాయత్‌‌సాగర్, ఉస్మాన్‌‌సాగర్ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల మేర సాగే ఈ తొలి విడత పనులను పూర్తిగా ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

పర్యావరణ పరిరక్షణతో పాటు, సుస్థిర పట్టణాభివృద్ధి, రవాణా వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా సుమారు 200 చదరపు కిలోమీటర్ల నగర పరిధిపై సానుకూల ప్రభావం చూపేలా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారు.

తొలి దశలో రెండు జోన్లు..  

మూసీ నది పరివాహక ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో విడతల వారీగా చేపట్టాలని నిర్ణయించి, అందులో భాగంగానే జోన్-1 పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పనులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. 

ఇందులో మొదటిదైన ‘జోన్-1ఏ’ కింద హిమాయత్‌‌సాగర్ నుంచి గాంధీ సరోవర్/బాపూఘాట్ వరకు గల 9.20 కిలోమీటర్ల పరిధిని రూ.3,232  కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ‘జోన్-1బీ’ కింద ఉస్మాన్‌‌సాగర్ నుంచి  బాపూఘాట్ వరకు ఉన్న 11.80 కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని రూ.4,113 కోట్ల అంచనా వ్యయంతో నదీ తీర ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మొత్తం అంచనా వ్యయం రూ.7,054 కోట్లు కాగా, దానికి అదనంగా 6 శాతం చొప్పున రూ.291 కోట్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) లూప్ కింద కేటాయించడంతో మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.7,345 కోట్లకు చేరింది. ఈ భారీ కేటాయింపుల్లో భూసేకరణకయ్యే ఖర్చులను మినహాయించారని, కేవలం భౌతిక పనుల నిర్మాణానికే ఈ నిధులు నిర్దేశించారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఈపీసీ పద్ధతిలో పనులు.. ఏడీబీ నిబంధనల ప్రకారం పర్యవేక్షణ

మూసీ నది పునరుజ్జీవ పనులను పారదర్శకంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈపీసీ మోడ్‌‌ను ఎంచుకుంది. పనుల పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ  సకాలంలో ప్రాజెక్టు అమలును నిరంతరం ట్రాక్ చేయడం కోసం ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌‌మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. 

ఈ పీఎంసీ నియామకం టెండర్ల ప్రక్రియ అంతా కూడా నిధులు సమకూరుస్తున్న ఏడీబీ నిర్దేశించిన  ప్రొక్యూర్‌‌మెంట్ గైడ్‌‌లైన్స్ ప్రకారమే జరుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.