నీట్ ​నిర్వహణలో తప్పు జరిగితే ఒప్పుకోండి

నీట్ ​నిర్వహణలో  తప్పు జరిగితే ఒప్పుకోండి
  • 0.001% నిర్లక్ష్యం వహించినా దాన్ని సరిదిద్దుకోండి
  • నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • సకాలంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ కామెంట్
  • తదుపరి విచారణ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా 

న్యూఢిల్లీ: మెడికల్​ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​పరీక్షలో పేపర్​ లీకేజీ, మాల్​ప్రాక్టీస్ జరిగిందంటూ వస్తోన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పరీక్ష నిర్వహించిన నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. పరీక్ష నిర్వహణలో తప్పు జరిగితే ఒప్పుకోవాలని పేర్కొంది. ఎవరైనా 0.001% నిర్లక్ష్యం వహించినా దాన్ని వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే లో నిర్వహించిన నీట్​లో అక్రమాలు జరిగాయని, దాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్​ విక్రమ్​నాథ్​, జస్టిస్​ ఎస్వీఎన్​ భట్టితోకూడిన వెకేషన్​ బెంచ్​ విచారణ చేపట్టింది. 

ఈ వ్యవహారంపై ఎన్టీఏ సకాలంలో చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని కామెంట్ ​చేసింది. అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని సూచించింది. ‘‘ఏజెన్సీగా ఓ ఎగ్జామ్​ నిర్వహించినప్పుడు ఫెయిర్​గా ఉండాలి. ఏదైనా పొరపాటు జరిగితే ఒప్పుకోవాలి. దాన్ని సవరించేందుకు చర్యలు చేపట్టాలి. ఇది మీపై విశ్వాసాన్ని కలిగిస్తుంది”అని బెంచ్​ వ్యాఖ్యానించింది. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు స్టూడెంట్స్​ పడ్డ కష్టాన్ని ఏజెన్సీ మరిచిపోకూడదని సూచించింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి డాక్టర్​ అయితే.. సమాజానికి ఎంత హానికరమో ఒక్కసారి ఊహించుకోవాలని చురకలంటించింది. తదుపరి విచారణను జులై 8న చేపడతామని స్పష్టం చేసింది.

నీట్​పై ప్రధాని స్పందించట్లేదేం?: రాహుల్​

దేశవ్యాప్తంగా నీట్​పరీక్షపై విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్​ఎంపీ రాహుల్​ గాంధీ ప్రశ్నించారు. 24 లక్షల మంది భవిష్యత్తు తారుమారవుతుంటే మోదీ ఎప్పటిలాగే స్పందించడం లేదని మండిపడ్డారు. పేపర్​ లీక్స్ కు వ్యతిరేకంగా బలమైన విధానాల రూపకల్పనకు పార్లమెంట్​లో తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు.