చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతమే : ఏడీఆర్

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతమే : ఏడీఆర్
  • మహిళలకు టికెట్లు ఇవ్వడంలో పార్టీల మీనమేషాలు
  • సుమారు 52 వేల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలుగా 
  • పోటీ చేస్తే... అందులో మహిళలకు పార్టీలు ఇచ్చింది 5 వేల టికెట్లే..
  • నివేదిక విడుదల చేసిన ఏడీఆర్​ సంస్థ

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 10 శాతమేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ‘విమెన్స్ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా’ పేరుతో ఆదివారం నివేదికను విడుదల చేసింది.  దేశంలోని 543 లోక్‌‌సభ స్థానాలు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,123 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన 51,708 మంది అభ్యర్థుల జాబితాను పరిశీలించినట్లు ఏడీఆర్ తెలిపింది.

వీరిలో కేవలం 5,095 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం 4,666 లోక్‌‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలు గెలిచినవి కేవలం 464 స్థానాలు మాత్రమే అని నివేదిక పేర్కొంది. లోక్‌‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్, వరంగల్ నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని బారామతి స్థానాల్లో ఎనిమిది మంది చొప్పున మహిళలు పోటీ చేశారు. తమిళనాడులోని కరూర్, పశ్చిమ బెంగాల్‌‌లోని కోల్‌‌కతా దక్షిణ్ నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున మహిళలు బరిలో నిలిచారు. 2023 సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు–2023ను 
లోక్‌‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం లోక్‌‌సభ,  రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు (33 శాతం) స్థానా లను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించారు.

కేరళ నుంచి లోక్‌‌సభకు ఒక్క మహిళా ఎంపీ లేదు.. 

దేశవ్యాప్తంగా లోక్‌‌సభకు మొత్తం 74 మంది మహిళలు ఎన్నికైనట్లు ఏడీఆర్ తెలిపింది. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ నుంచి 11 మంది మహిళా ఎంపీలు గెలిచారు. అనంతరం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఏడుగురు చొప్పున, మధ్యప్రదేశ్ నుంచి ఆరుగురు మహిళలు ఎంపీలు గెలుపొందినట్లు రిపోర్ట్​లో పేర్కొంది. అయితే కేరళ నుంచి ఒక్క మహిళా ఎంపీ కూడా లేదని నివేదిక వెల్లడించింది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ నుంచి 31 మంది, కాంగ్రెస్ నుంచి 13 మంది, టీఎంసీ నుంచి 11 మంది మహిళలు లోక్‌‌సభకు ఎన్నికయ్యారు.

అసెంబ్లీల్లోనూ తక్కువ ప్రాతినిధ్యం..

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 390 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలంగాణలో 222 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేసినట్లు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 492 పొలిటికల్​పార్టీలు 5,095 మంది మహిళలకు టికెట్లు ఇచ్చాయి. బీఆర్ఎస్ 136 మంది  అభ్యర్థులను ప్రకటించగా, 127 మంది పురుషులు, కేవలం 9 మంది (7 శాతం) మాత్రమే మహిళలు ఉన్నారు. అత్యధికంగా నామ్ తమిళార్ కట్చి పార్టీ సుమారు 50 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చింది. మొత్తం 302 మందిలో 152 మంది పురుషులు, 150 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ఇతర పార్టీల్లో బీజేడీ 25 శాతం, కాంగ్రెస్ 14 శాతం, టీడీపీ 14 శాతం, వైఎస్సార్ సీపీ 12 శాతం, బీజేపీ 11 శాతం, సీపీఐ (ఎం) 10 శాతం, బీఎస్పీ 9 శాతం, ఆప్ 8 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చాయి.

సంపన్న మహిళలే అధికం

మహిళా ప్రజాప్రతినిధుల్లో కోటీశ్వరులే అధికంగా ఉన్నారని ఏడీఆర్ వెల్లడించింది. మొత్తం 464 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తుల విలువ రూ.17.30 కోట్లు కాగా, మొత్తం ఆస్తుల విలువ రూ.8,234 కోట్లు అని తెలిపింది. అత్యధిక ఆస్తులు కలిగిన మహిళా ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన టీడీపీ నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ రూ.291 కోట్లుగా ఏడీఆర్​తెలిపింది.

ఆ తర్వాత కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రూ.388 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో, నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి రూ.291 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణలో గెలిచిన 11 మంది మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల విలువ రూ.159 కోట్లు కాగా, సగటు ఆస్తి విలువ రూ.14 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. ఇక ఎన్నికైన 464 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 127 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, అందులో 68 మందిపై సీరియస్​క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపింది.