కల్తీ కల్లు కట్టడికి చర్యలు .. హనుమకొండ జిల్లాలో మూడు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న ఆఫీసర్లు

కల్తీ కల్లు కట్టడికి చర్యలు .. హనుమకొండ జిల్లాలో మూడు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న ఆఫీసర్లు
  • 20 చోట్ల నుంచి శాంపిల్స్ సేకరణ, ల్యాబ్ కు తరలింపు

హనుమకొండ, వెలుగు: హైదరాబాద్​ కూకట్​పల్లి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో మరేచోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతోంది. కల్లు శాంపిల్స్ సేకరించి, టెస్టులు చేయాల్సిందిగా ఎక్సైజ్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. స్టేట్ వైడ్ గా వివిధ జిల్లాల్లో ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు కల్తీ కల్లుపై ఆరా తీస్తున్నారు. వీకెండ్స్ తోపాటు సాధారణ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే కల్లు మండవాల్లో కల్లు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ మేరకు వాటిని హైదరాబాద్, వరంగల్ లోని ల్యాబ్ లకు పంపించి టెస్టులు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో 20 చోట్ల నుంచి శాంపిల్స్..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు మూడు రోజులుగా తాటి కల్లు మండువాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్, హౌజ్ బుజుర్గు, ఎల్కతుర్తి మండలం కేంద్రంలోని మండువా, భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, కమలాపూర్ మండల కేంద్రంతోపాటు వంగపల్లి మండువా, హసన్ పర్తి మండలంలోని చింతగట్టు, జయగిరి, గోపాలపూర్, వేలేరు మండల కేంద్రం.. ఇలా హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 20 చోట్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. 

స్థానిక పోలీసుల సహాయంతో హనుమకొండ ఎక్సైజ్ ఎస్సై వెంకన్న ఆధ్వర్వంలో ఈ స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. స్థానిక కల్లు గీత కార్మికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన కల్లు శాంపిల్స్ ను వరంగల్ రీజినల్ ల్యాబ్ కు పంపిస్తున్నామని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. కల్తీ కల్లు అమ్ముతున్నట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

గతంలోనూ ఆనవాళ్లు..

కల్తీ కల్లు ఆనవాళ్లు వరంగల్ నగరంలోనూ ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 12న వరంగల్ నగరంలోని లక్ష్మీపురంలో కల్తీ కల్లు తయారు చేస్తున్న గ్యాంగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివిధ రకాల కెమికల్స్, చాకోలేన్ పౌడర్, చక్కర తదితర పదార్థాలు కలిపి కల్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు లక్ష్మీపురం, దేశాయిపేటకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.24 వేల విలువైన 600 సీసాల కల్లును స్వాధీనం చేసుకున్నారు. 

కాగా, వరంగల్ నగర శివారుల్లో ఉండే కల్లు మండువాల్లో కొంతమంది ఆల్ఫ్రాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, క్లోరోఫామ్ తదితర రసాయనాలు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ కల్లు బారిన పడుతున్న వాళ్లలో దినసరి కూలీలు,పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే ఉంటున్నారు. దీంతో కల్తీ కల్లు నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.