
ఆర్మూర్, వెలుగు : ముందస్తు ఆర్డర్స్ ఇచ్చిన వారికి 40 శాతం డిస్కౌంట్ అంటూ అడ్వాన్స్ వసూలు చేసి బోర్డు తిప్పిన ఓ ట్రేడర్స్ బాగోతం ఆర్మూర్లో వెలుగు చూసింది. ఆర్మూర్ టౌన్ లోని నిజాంసాగర్ కెనాల్ పక్కన జిరాయత్ నగర్ కు వెళ్లే మెయిన్ రోడ్డు పక్కన ఇటీవల ఓ ట్రేడర్స్ ఏర్పాటైంది. ఫర్నిచర్, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి వాటికి 40 శాతం డిస్కౌంట్ఆఫర్ అంటూ విస్తృత ప్రచారం చేశారు. దీంతో అనేకమంది ముందస్తుగా డబ్బులు చెల్లించి ఆర్డర్ చేసుకున్నారు.
తీరా వారు స్టాక్ డెలివరీ చేస్తామన్న తేదీ దగ్గరకు వచ్చినా తామిచ్చిన ఆర్డర్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. షాప్ క్లోజ్ ఉండటం, ఓనర్స్కు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, వారం రోజులు గడిచినా షాపు తీయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణగౌడ్ తెలిపారు.