అద్వానీకి భారతరత్న ప్రదానం

అద్వానీకి భారతరత్న ప్రదానం
  • స్వయంగా ఇంటికెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 
  • హాజరైన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్​, ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీకి భారతరత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆమె ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. శనివారం రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగ్గా, అనారోగ్య కారణాలతో అద్వానీ హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​ ఖడ్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ‘‘అద్వానీ గొప్ప రాజకీయ నాయకుడు. ఏడు దశాబ్దాలకు పైగా అంకితభావంతో దేశం కోసం పని చేశారు. ఉప ప్రధానిగా, కేంద్ర హోం మంత్రిగా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలకతీతంగా అందరి మన్ననలు పొందారు” అని కొనియాడింది. ‘‘భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అద్వానీ అలుపెరగని పోరాటం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ఆయన కల నెలవేరింది” అని పేర్కొంది. 

ఆనందంగా ఉంది: మోదీ 

దేశానికి అద్వానీ చేసిన సేవలకు తగిన గౌరవం దక్కిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయనకు భారతరత్న అవార్డు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ‘‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. అంకితభావంతో ప్రజలకు సేవలందించారు. ఆయన దేశానికి అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. గత కొన్ని దశాబ్దాలుగా అద్వానీతో కలిసి పనిచేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో మోదీ పోస్టు పెట్టారు. అద్వానీ తన జీవితాన్ని దేశానికే అంకితం  చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. ఆయనకు భారతరత్న అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.