
- రాజీనామాపై ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకొని ఉంటరు
- దీనిపై పునరాలోచించాలని కవితకు చెప్పా: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ, వెలుగు: ఎమ్మెల్సీ కవిత రాజీనామాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజీనామాపై ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకొని ఉంటారని, దీనిపై పునరాలోచించాలని ఆమెకు సూచించానన్నారు. గురువారం నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వైద్య రంగానికి ఏటా దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ పథకాలపైనా మరోసారి సమీక్ష చేయాలని సూచించారు.
గతంలో తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు సరిగా లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని, అయితే, ప్రస్తుతం 32 జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయని, హైదరాబాద్‌లో మరో నాలుగు పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లకి ప్రోత్సహకాలు ఇచ్చి మెరుగైన వైద్య సేవలందించేలా చూడాలని సూచించారు.
ప్రైవేట్ హాస్పిటల్‌కి ఇస్తున్న ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ నిధులను ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి వినియోగించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పారు. నల్గొండ జిల్లా తాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తన అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశానన్నారు. యూరియా ఉత్పత్తి లేకపోవడంతోనే సరిపడా సరఫరా జరగడంలేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కోర్టు పరిధిలో ఉందని, ఎమ్మెల్యేలు అఫిడవిట్‌లో ఏం రాసిచ్చారో తెలియదని చెప్పారు.