హైదరాబాద్, వెలుగు: ఏరోస్పేస్ డిఫెన్స్ మానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ జెహ్ ఏరోస్పేస్ తన రెండో తయారీ యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించింది. దీని కోసం రాబోయే 6-12 నెలల్లో 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 445 కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. జనరల్ కాటలిస్ట్, ఎలివేషన్ క్యాపిటల్, ఇండిగో వెంచర్స్ వంటి పెట్టుబడిదారుల మద్దతు ఉన్న ఈ స్టార్టప్, 18 నెలల్లోనే 150 మిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్ బుక్‌ను సంపాదించింది.
హైదరాబాద్ సమీపంలో ఉన్న హారిజోన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాక్ 2 అనే పేరుతో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, అంతర్జాతీయ కస్టమర్ల కోసం సరఫరా గొలుసును బలోపేతం చేస్తుంది. ఈ కొత్త యూనిట్ వచ్చే సంవత్సరం కార్యకలాపాలను ప్రారంభించనుందని జెహ్ తెలిపింది.
పుణేలో జీఈ ఏరోస్పేస్ కేంద్రం విస్తరణ
పుణేలోని తమ యూనిట్ విస్తరణకు రూ.124 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు జీఈ ఏరోస్పేస్ ప్రకటించింది. ఈ తయారీ కేంద్రం విజయవంతంగా దశాబ్దం పూర్తి చేసుకుందని తెలిపింది. తాజా పెట్టుబడి గత సంవత్సరం ప్రకటించిన 30 మిలియన్ డాలర్ల పెట్టుబడిలో ఒక భాగం.
ఈ నిధులతో అధునాతన ఇంజిన్ భాగాలకు మద్దతు ఇచ్చేలా తయారీ ప్రక్రియలను, ఆటోమేషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తారు. ఈ కేంద్రం ప్రస్తుతం 300కు పైగా సరఫరాదారుల నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంది. గత 10 సంవత్సరాలలో ఐదు వేలకు పైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, స్థానిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది.
