
హైదరాబాద్, వెలుగు: వచ్చే అకడమిక్ ఇయర్ 2023–24 నుంచి డిగ్రీ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియను ఆన్లైన్ద్వార నిర్వహించాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయించింది. కోర్సుల వారీగా కాకుండా జెనరిక్ అఫిలియేషన్లు చేపట్టనుంది. యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్(యూఎంఎస్ ) ద్వారా ఈ ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఆరు యూనివర్సిటీల వీసీలతో కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాలేజీ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సమావేశమయ్యారు. కరోనా తగ్గడంతో విద్యా సంవత్సరం రికవరీపై చర్చించారు. లింబాద్రి మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరంలో జులై నుంచే డిగ్రీ ఫస్టియర్ క్లాసులను ప్రారంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు, పీజీ పరీక్షల ఎంట్రెన్స్లను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని..దానికి అనుగుణంగానే పరీక్షలను ముగించాలని వీసీలకు సూచించామన్నారు. కరోనా వల్ల మూడేండ్లుగా అకడమిక్ ఇయర్ గాడితప్పిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలు న్యాక్ గ్రేడింగ్ పొందేందుకు అన్ని రకాల సపోర్టు చేయనున్నట్లు లింబాద్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో వీసీలు డి.రవీందర్, తాటికొండ రమేశ్, గోపాల్ రెడ్డి, లక్ష్మీకాంత్ , రవీందర్ గుప్తా, మల్లేశం పాల్గొన్నారు.