- హాజరైన మంత్రి కొండా సురేఖ, ఎంపీ చామల, ఎమ్మెల్యే బీర్ల
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయ పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ తో పాటు 10 మంది బోర్డు సభ్యులు, ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 18 మందితో కొత్త పాలకమండలి కొలువుదీరింది. ప్రధానాలయ ముఖ మండపంలో బోర్డు సభ్యులతో ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దాదాపు 17 ఏండ్ల తర్వాత ఆలయ ట్రస్ట్ బోర్డు కొలువుదీరింది.
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డుచైర్మన్ గా మన్నె సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈవో భవానీ శంకర్, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బోర్డు సభ్యులు తూళ్ల విజయేందర్ గౌడ్, నరసింహమూర్తి, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గైర్హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారానికి మంత్రి కొండా సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చీఫ్ గెస్టులుగా హాజరై బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
భక్తులకు మెరుగైన సౌలతులు కల్పిస్తాం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని వైటీడీ బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్ లో బోర్డు చైర్మన్ అధ్యక్షతన పాలకమండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు.
ఆలయంలో సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులు ఇబ్బంది పడకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలో చర్చించామని తెలిపారు. భక్తులకు వసతి సమస్య ఉన్నట్లు గుర్తించామని, దీక్షాపరులకు కొండపైన నిద్ర చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టెంపుల్ సిటీలో విల్లాలు కట్టాలా? టవర్స్ బిల్డింగులు నిర్మించాలా? అనే విషయంపై ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
