కోల్‌కతా: ఇండియా ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చివరి మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ 2–1తో ఇంటర్ కాశీ జట్టును ఓడించి తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దాంతో 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ట్రోఫీ కలను నెరవేర్చుకుంది. చివరిసారిగా ఈ క్లబ్ 2003–-04 నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) లీగ్ టైటిల్ సాధించింది. ఈస్ట్ బెంగాల్ తరఫున యూసెఫ్ ఎజ్జెజారి (50వ ని), మహ్మద్ రషీద్ (73వ ని) గోల్స్ చేయగా, ఆల్‌ఫ్రెడ్ (15వ ని) ఇంటర్ కాశీకి ఏకైక గోల్ అందించాడు.
ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఇంటర్ కాశీ ప్లేయర్లు మధ్యలో ఫెయిలయ్యారు. ఈసారి టోర్నీని 13 మ్యాచ్‌ల సింగిల్ లెగ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించారు. ప్లే ఆఫ్స్ లేకపోవడంతో పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచిన ఈస్ట్ బెంగాల్‌ను విజేతగా ప్రకటించారు. చివరి రౌండ్ మ్యాచ్‌లకు ముందు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ చెరో 23 పాయింట్లతో నిలిచాయి. చివరి మ్యాచ్‌ల్లో మోహన్ బగాన్ 2–1తో స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీపై, ముంబై ఎఫ్‌సీ 2–0తో పంజాబ్ ఎఫ్‌సీపై నెగ్గాయి. దీంతో ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ రెండు జట్లూ 13 మ్యాచ్‌ల్లో 26 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే, గోల్స్ పరంగా మెరుగైన ప్రదర్శన చేసిన ఈస్ట్ బెంగాల్ (+19) సూపర్ గోల్ డిఫరెన్స్ ఆధారంగా మోహన్ బగాన్ (+13) పై ఆధిపత్యం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
