40 ఏండ్ల తర్వాత మరాఠ్వాడలో పులి

40 ఏండ్ల తర్వాత మరాఠ్వాడలో పులి

మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో నలభై ఏళ్ల తర్వాత తొలిసారి ఓ పెద్ద పులి కనిపించింది. అక్కడి ఫారెస్టు డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అధికారులు ఈ విషయాన్ని కన్‌‌‌‌ఫమ్‌‌‌‌ చేశారు. హింగోలీ జిల్లాలో ఓ యువ మగ పులి తిరుగుతోందన్నారు. తనున్న ప్రాంతం నుంచి సుమారు 200 కిలోమీటర్లు నడిచి ఇక్కడికొచ్చిందని, దాని జర్నీ 5 నెలలు సాగిందని వెల్లడించారు. వచ్చే దారిలో పెన్‌‌‌‌గంగా నదీ లోయ, పెద్ద పెద్ద వ్యవసాయ భూములు, గుట్టలను దాటొచ్చిందని చెప్పారు. ఆ టైగర్‌‌‌‌ పేరు సీ1 అని, మూడేళ్లుంటుందని తెలిపారు. యవత్మాల్‌‌‌‌ జిల్లాలోని తిపేశ్వర్‌‌‌‌ వైల్డ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ శాంక్చువరీలో ఉండేదన్నారు. తమ మేటింగ్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌, ఆహారం బాగా దొరికే ప్రాంతం కోసం ఇలా టైగర్లు వందల కిలోమీటర్లు వెళ్తుంటాయన్నారు. 1972లో గౌతాలా ఔట్రమ్‌‌‌‌ఘాట్‌‌‌‌ శాంక్చువరీలో టైగర్‌‌‌‌ కనిపించిందని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే దర్శనమిచ్చిందని వివరించారు. లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ మానీటరింగ్‌‌‌‌ ప్రాజెక్టులో భాగంగా సీ1కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐడెంటిఫికేషన్‌‌‌‌ డివైస్‌‌‌‌ (రేడియో కాలర్‌‌‌‌)ను అమర్చారు. అక్టోబర్‌‌‌‌ 19 నుంచి 30 వరకు యవత్మాల్‌‌‌‌ జిల్లాలోని ఉమార్కెడ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ రేంజ్‌‌‌‌లో ఉందీ పులి. 30న నాందేడ్‌‌‌‌, యవత్మాల్‌‌‌‌ బార్డర్‌‌‌‌లోని ఇసాపుర్‌‌‌‌ శాంక్చువరీలో కనిపించింది.  తెలంగాణలోని ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలోనూ తిరిగింది. ఇప్పుడు మరాఠ్వాడాలోకి వచ్చింది.

టైగర్లను పేర్లతో పిలవొద్దు

టూరిస్టులున్నప్పుడు టైగర్లను వాటికి పెట్టిన పేర్లతో పిలవొద్దని సిబ్బందిని ఉత్తరాఖండ్‌‌‌‌ ఫారెస్టు అధికారులు ఆదేశించారు. దీని వల్ల వాటి భద్రత ప్రమాదంలో పడొచ్చని చెప్పారు. రూల్స్‌‌ పాటించకపోతే వైల్డ్‌‌‌‌లైఫ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ 1972లోని సెక్షన్‌‌‌‌ 9 ప్రకారం శిక్షార్హులన్నారు. టైగర్లను వాటి పేర్లతో పిలిచి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌‌‌‌ మీడియాలో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తే వాటి గురించి ఎక్కువ సమాచారం బయటకు తెలిసినట్టవుతుందని చెప్పారు. కాబట్టి టూరిస్టులు కూడా ఇలాంటివి చేయొద్దన్నారు.