సీఎం అయ్యాక కేసీఆర్ అన్నీ మర్చిపోయారు: లక్ష్మణ్

సీఎం అయ్యాక కేసీఆర్ అన్నీ మర్చిపోయారు: లక్ష్మణ్

కేసీఆర్ సీఎం కాకముందు ఒక మాట…సీఎం అయ్యాక ఒక మాట మాట్లాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.  రంగులు మార్చే ఊసరవెల్లి తరహాలో కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు.  యూ టర్న్ తీసుకున్న సీఎంలకు ఎలాంటి పరాభవం జరిగిందో .. అలాంటి పరిస్థితి కేసీఆర్ కి జరగబోతోందన్నారు. ఆర్టీసీ కార్మికుల పై సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అన్న కేసీఆర్ కార్మికుల గుండెల్లో గునపాలు గుచ్చారని విమర్శించారు. దసరా పండుగ రోజు  50 వేల ఆర్టీసీ కార్మిక కుటుంబాలను కేసీఆర్  రోడ్డున పడేశారన్నారు.

పాత బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోడం కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత బస్ పాస్ రియంబర్స్ మెంట్  వందల  కోట్లు బకాయిలు ఉంటే పదుల సంఖ్యలో మాత్రమే చెల్లింపు జరిగిందన్నారు.  నెల రోజుల ముందు సమ్మె నోటీసులు ఇస్తే ముందే  ప్రభుత్వం, యాజమాన్యం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.  సీఎం కేసీఆర్ ఆర్టీసీ జేఏసీతో చర్చల కోసం ఒక్క గంట సమయం ఎందుకు కేటాయించలేదన్నారు.  రవాణా శాఖ మంత్రి ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నాడా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చేతిలో పెట్టుకొని  బంగారు తెలంగాణ ఎలా చేస్తారని అడిగారు.  కార్మికుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు లక్ష్మణ్.