న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్‌ఆర్ఈజీఏ) పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) బిల్లును కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నల్ల చట్టంగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా పో రాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ సర్కార్ పూర్తిగా అణివేస్తోందని మండిపడ్డారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్ఈజీఏ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) బిల్లును పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకం చట్టం పేరు మార్పుపై సోనియా గాంధీ స్పందించారు. 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు.
ఈ స్కీమ్ లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మక చర్య అని అన్నారు. ఈ పథకం పేదల ఉపాధికి చట్టబద్ధమైన హక్కును కల్పించడంతో పాటు గ్రామ పంచాయతీలను బలోపేతం చేసిందన్నారు. ఈ పథకం ద్వారా మహాత్మా గాంధీ కన్న కలల వైపు ఒక నిర్దిష్ట అడుగు పడిందని అన్నారు. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ పేదలకు ఈ స్కీమ్ జీవనాధారంగా మారిందని పేర్కొన్నారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక గత 11 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్ఈజీఏ పథకాన్ని పూర్తిగా అణిచివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి చర్చలు, సంప్రదింపులు లేకుండానే ఉపాధి హామీ పథకం రూపం, నిర్మాణాన్ని మోడీ సర్కార్ ఏకపక్షంగా మార్చిందని నిప్పులు చెరిగారు. ఈ చట్టాన్ని బలహీనపరచడం ద్వారా మోడీ ప్రభుత్వం కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూమిలేని గ్రామీణ పేదల ప్రయోజనాలపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ చర్య మహాత్మా గాంధీ పేరును తొలగించడం కంటే చాలా ఎక్కువని అన్నారు.
