కోల్‌కతా: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. చొరబాటుదారులను కాపాడటానికే టీఎంసీ ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ మహా జంగిల్ రాజ్ పాలనను బీజేపీ అంతం చేస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. శనివారం (డిసెంబర్ 20) ప్రధాని మోడీ వెస్ట్ బెంగాల్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొని ఆయన ప్రసగించారు. బెంగాల్‌లో చొరబాటుదారులను టీఎంసీ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆరోపించారు. టీఎంసీ బీజేపీని వ్యతిరేకించగలదు కానీ బీహార్ ఎన్నికల ఫలితాలు బెంగాల్‌లో కాషాయ పార్టీకి తలుపులు తెరిచాయని అన్నారు. బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం బెంగాల్‌లో బీజేపీ గెలుపుకు మార్గం సుగమం చేసిందన్నారు. బీహార్ ప్రజలు జంగిల్ రాజ్ పాలనను ముక్తకంఠంతో తిరస్కరించారని.. ఇప్పుడు మనం బెంగాల్‌లో మహా జంగిల్ రాజ్ పాలనను వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలా సహకరిస్తోందని.. కానీ రాష్ట్రంలో అభివృద్ధిని టీఎంసీ ఎందుకు అడ్డుకుంటుందో అర్ధం కావడం లేదని అన్నారు. మీరు మోడీని వ్యతిరేకించండి కానీ బెంగాల్ ప్రజల హక్కులను కాలరాయకండని టీఎంసీ ప్రభుత్వాన్ని కోరారు. 2026లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇవ్వాలని ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు.
