దేశంలోని ప్రముఖ హెల్త్‌కేర్ దిగ్గజం ఫోర్టిస్ హెల్త్‌కేర్. తాజాగా ఇది బెంగళూరు నగరంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారీ అడుగు వేసింది. నగరంలోని యశ్వంత్‌పూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ 'పీపుల్ ట్రీ హాస్పిటల్'ను (TMI హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్) రూ.430 కోట్ల కొనుగోలు చేస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో బెంగళూరులో ఫోర్టిస్ తన నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా.. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని నిర్ణయించింది ఫోర్టిస్.
ఈ డీల్ వివరాల్లోకి వెళ్తే.. ఫోర్టిస్ హెల్త్‌కేర్ తన అనుబంధ సంస్థ 'ఇంటర్నేషనల్ హాస్పిటల్ లిమిటెడ్' ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం పీపుల్ ట్రీ హాస్పిటల్ 125 బెడ్ల సామర్థ్యంతో నడుస్తోంది. అయితే ఫోర్టిస్ కేవలం ఈ ఆసుపత్రిని కొనుగోలు చేయడమే కాకుండా.. దానికి ఆనుకుని ఉన్న సుమారు 0.8 ఎకరాల అదనపు భూమిని కూడా తన సొంతం చేసుకుంది. ఈ అదనపు స్థలంలో మరో మూడు నుండి నాలుగు ఏళ్లలో కొత్త విభాగాన్ని నిర్మించి, మొత్తం బెడ్ల సామర్థ్యాన్ని 300కు పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీని కోసం అదనంగా మరో రూ.410 కోట్ల పెట్టుబడికి సిద్ధమైంది.
బెంగళూరు హెల్త్ కేర్ మార్కెట్లో ఫోర్టిస్ ఇప్పటికే బలంగా ఉంది. ప్రస్తుతం నగరంలో ఫోర్టిస్‌కు 7 ఆసుపత్రులు ఉండగా, వాటిలో మొత్తం 900 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. తాజా విస్తరణ తర్వాత రాబోయే కొద్ది కాలంలో బెంగళూరులో తమ మొత్తం బెడ్ల సామర్థ్యాన్ని 1,500కు చేర్చాలనేది కంపెనీ వ్యూహం. పీపుల్ ట్రీ హాస్పిటల్ ప్రధానంగా ఆర్థోపెడిక్స్, న్యూరో సైన్సెస్, రీనల్ సైన్సెస్ వంటి విభాగాల్లో మంచి పేరు కలిగి ఉంది. ఇప్పుడు ఫోర్టిస్ దీనిని కైవసం చేసుకోవడంతో ఇక్కడ అధునాతన క్యాన్సర్ చికిత్సవంటి సేవలను కూడా ప్రవేశపెట్టనున్నారు.
బెంగళూరు తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని ఈ ఒప్పందంపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఎండీ, సీఈఓ ఆశుతోష్ రఘువంశీ అభిప్రాయపడ్డారు. పీపుల్ ట్రీ విలీనం ద్వారా మరింత మంది రోగులకు నాణ్యమైన, అత్యున్నత స్థాయి వైద్య సేవలను అందించగలమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఉన్న ఒప్పందం ప్రకారం 2026 జనవరి నాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ముగియనుంది. ఈ భారీ డీల్ ద్వారా బెంగళూరు ఉత్తర ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని సీఈఓ అభిప్రాయపడ్డారు.
