శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.81కోట్లు

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.81కోట్లు

లాక్ డౌన్ తర్వాత ఇంత భారీ ఆదాయం ఇదే తొలిసారి

కర్నూలు: శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సుమారు 400 మంది ఆలయ సిబ్బందితోపాటు వాలంటీర్లు, భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. కరోనా నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించారు. ఈవో కె.ఎస్.రామారావు దగ్గరుండి లెక్కింపును పర్యవేక్షించారు. చీఫ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.గత 20 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు  నగదు రూపంలో ఒక కోటి 81 లక్షల 91 వేల 821 రూపాయల  ఆదాయంగా వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కేఎస్ రామారావు తెలిపారు.  నగదుతోపాటు 270 గ్రాముల బంగారం, కేజీ 980 గ్రాముల వెండి, 2 సింగపూర్ డాలర్లు, 50 ఇంగ్లండ్ పౌండ్స్, 10 కెనడా డాలర్లు, 29 అమెరికా  డాలర్లు, 1 సౌదీ రియాల్స్ స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆయన వివరించారు.