న్యూఢిల్లీ: ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్ తనను కొనుగోలు చేయడం వల్ల కొత్త జీవితం లభించిందని టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఈ మేరకు ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు చెప్పాడు. మంగళవారం జరిగిన వేలానికి ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్ఫరాజ్ 22 బాల్స్‌లో 77 రన్స్ కొట్టాడు. అయితే తొలి రౌండ్ వేలంలో సర్ఫరాజ్‌ను ఎవరూ తీసుకోలేదు. కానీ రెండో రౌండ్‌లో సీఎస్కే అతన్ని బేస్‌ప్రైస్ రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది. ‘నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సీఎస్కే. కచ్చితంగా ఈసారి టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్నా’ అని సర్ఫరాజ్ వెల్లడించాడు.
2023లో చివరిసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్‌ను తర్వాతి రెండు సీజన్లలో ఎవరూ తీసుకోలేదు. డొమెస్టిక్ క్రికెట్‌లో మెరుగైన పెర్ఫామెన్స్ చేసినా.. టీమిండియాకు ఎంపిక కాలేదు. దాంతో అతని ఇంటర్నేషనల్ కెరీర్ గందరగోళంలో పడింది. గత ఐపీఎల్ ఎడిషన్లలో సర్ఫరాజ్ బెంగళూరు, పంజాబ్, ఢిల్లీకి ఆడాడు. ఇక టీమిండియా తరఫున ఆరు టెస్ట్‌లు ఆడిన సర్ఫరాజ్ 37.10 సగటుతో 371 రన్స్ చేశాడు.
