- ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1 ఆధిక్యంలో టీమిండియా
- రేపు ఇరుజట్ల మధ్య ఐదో టీ20
లక్నో: దట్టమైన పొగమంచు కారణంగా.. ఇండియా, సౌతాఫ్రికా మధ్య బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దయింది. సాయంత్రం నుంచే స్టేడియం మొత్తాన్ని పొగమంచు ఆవరించి ఉండ5టంతో విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయింది. దాంతో టాస్ వేయడాన్ని ఆలస్యం చేశారు. అక్కడి నుంచి ప్రతి అర్ధ గంటకు ఒకసారి అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించారు. విజిబిలిటీ మెరుగుపడితే తక్కువ ఓవర్ల మ్యాచ్‌నైనా ఆడించేందుకు ప్రయత్నించారు. కానీ వాతావరణంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. 9.30 గంటలకు ఆరోసారి మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం లక్నోలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిలో 400 కంటే ఎక్కువగా నమోదైంది. దాంతో స్టేడియంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సర్జికల్ మాస్క్‌తో కనిపించాడు. స్టేడియం మొత్తాన్ని పొగమంచు కప్పేయడంతో వామప్ సెషన్‌ను వదిలేసి ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2–1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 శుక్రవారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది. బొటన వేలి గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ చివరి రెండు టీ20లకు దూరమయ్యాడు.
ఇదేం షెడ్యూల్..
నవంబర్, డిసెంబర్‌లో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వాయు కాలుష్యం ఉంటుందని తెలిసినా బీసీసీఐ మ్యాచ్‌లు కేటాయించడాన్ని విశ్లేషకులు తప్పుబట్టారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లకు న్యూ చండీగఢ్, ధర్మశాల, లక్నో, రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నం, కటక్, అహ్మదాబాద్, గువాహటి, కోల్‌కతాను వేదికలుగా ఖరారు చేశారు. అయితే ఇందులో లక్నో, న్యూ చండీగఢ్, ధర్మశాలలో విపరీతమైన పొగమంచు కురుస్తుంటుంది. రాత్రయ్యే కొద్ది విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోతుంది. ఎన్ని ఫ్లడ్ లైట్స్ వేసినా మ్యాచ్‌కు సరిపడా వాతావరణాన్ని తీసుకురావడం చాలా కష్టం. నాలుగో టీ20 కోసం ఎకానా స్టేడియానికి వచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మధ్యలో గ్రౌండ్‌లోకి వచ్చాడు.
విపరీతమైన పొగమంచు ఉండటంతో ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు. అధికారులతో చర్చించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కనీసం న్యూజిలాండ్‌తో వచ్చే ఏడాది జనవరి 11 నుంచి జరిగే వైట్‌బాల్ సిరీస్ కోసం ఎంపిక చేసిన వేదికలపై బీసీసీఐ నిర్ణయం మారుతుందేమో చూడాలి. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 సందర్భంగా ధర్మశాలలో 10 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు తనకు సవాలుగా మారాయని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అప్పుడే వ్యాఖ్యానించాడు. ఉత్తర భారత నగరాల చారిత్రక వాతావరణ డేటా బీసీసీఐ వద్ద లేకపోతే.. కనీసం మధ్యాహ్నం నుంచి మ్యాచ్‌లను ప్రారంభించడానికి ప్లాన్–బి అయినా రెడీగా లేకపోవడం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.
