- ఇంటర్ విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపణ
- కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా
కూకట్ పల్లి, వెలుగు: ర్యాగింగ్ వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఇంటర్ ఫస్టియర్ఎంపీసీ విద్యార్థి శ్రీకేతన్(17) తల్లిదండ్రులు బలరాం, నాగలక్ష్మి ఆరోపించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో ఓ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి బుధవారం ధర్నా చేపట్టారు. శ్రీకేతన్ను కళాశాలలో చేర్చే సమయంలో ఈ క్యాంపస్ లో ఫస్టియర్ విద్యార్థులను మాత్రమే పెడతామని చెప్పి సెకండియర్ వాళ్లను కలిపారన్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కచ్చితంగా ర్యాగింగ్జరిగి ఉంటుందని పేర్కొన్నారు.
యాజమాన్యమే దీనికి సమాధానం చెప్పాలన్నారు. కుమారుడు చనిపోయిన విషయాన్ని తమకు చెప్పకుండా మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. కిటికీకి ఉరేసుకున్నాడని చెప్తున్నారని, పోలీసులు, కళాశాల యాజమాన్యం కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. కళాశాల యాజమాన్యాన్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
