మంచు మనోజ్ హీరోగా హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. మంచు మనోజ్ మాట్లాడుతూ ‘నన్ను ప్రేక్షకులు ఎలాంటి సినిమాలో చూడాలని కోరుకుంటున్నారో అలాంటి కథ ఇది.
1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ మూవీ. ఇండియాకు స్వాతంత్ర్యం అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలి అనేది డేవిడ్ రెడ్డి దృక్పథం. అతను బ్రిటీష్ వారికే కాదు ఇండియన్స్‌కు కూడా శత్రువే. ఇలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి నాతో మూవీ చేస్తున్న డైరెక్టర్ హనుమకు థ్యాంక్స్. అలాగే క్వాలిటీ పరంగా రాజీ పడకుండా వెంకట్ రెడ్డి, భరత్ నిర్మిస్తున్నారు’ అని చెప్పారు.
ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో మనోజ్‌ను చూడబోతున్నారని, రవి బస్రూర్ సంగీతం, సుప్రీమ్ సుందర్ స్టంట్స్ ఇంప్రెస్ చేస్తాయని నిర్మాతలు వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి చెప్పారు. ‘‘మనకు ఒకరే భగత్ సింగ్, ఒకరే సుభాష్ చంద్రబోస్, అలాగే ఒకరే డేవిడ్ రెడ్డి. నిజమైన పాన్ ఇండియా సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఫిక్షనల్ క్యారెక్టర్‌తో రాసిన స్క్రిప్ట్” అని దర్శకుడు హనుమరెడ్డి తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ పాల్గొన్నారు.
