హైదరాబాద్ సిటీ, వెలుగు: మన రెండు చేతుల్లో ఒకటి పరులకు చేయూతనందించడానికి ఉపయోగపడాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తమతో పాటు చుట్టుపక్కల వాళ్లను కూడా సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతో ‘యువ ఆపద మిత్ర’ పేరుతో వలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఫతుల్లాగూడలో ఏర్పాటు చేసిన వారం రోజుల శిక్షణను బుధవారం ఆయన ప్రారంభించారు.
పరుల కోసం పాటుపడే ఆలోచనతో ఇంత మంది శిక్షణకు రావడం ఆనందదాయకమన్నారు. పరులకు చేయూత ఇవ్వడమే నిజమైన జీవితమన్నారు. వారం రోజుల శిక్షణలో అన్ని మెలుకువలు నేర్చుకుని మరింత మందికి తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా హైడ్రా కార్యకలాపాలపై విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసిన కమిషనర్.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తెలుసుకున్నారు.
