జనం థియేటర్లకు పోతలె

జనం థియేటర్లకు పోతలె

వెలుగు, బిజినెస్​ డెస్క్​: కరోనా తర్వాత ట్రెండ్ ​మారిపోయింది. దేశంలో ఫిల్మ్​ థియేటర్లకు వెళ్లే  ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. కరోనాకు మునుపటితో పోలిస్తే  థియేటర్స్​కు వెళ్లే వారి సంఖ్య గతేడాది 2.4 కోట్లు డౌన్​ అయింది. 2020 జనవరి-  -మార్చి మధ్యకాలంలో 14.6 కోట్ల మంది థియేటర్స్​కు వెళ్లగా, గతేడాది 12.2 కోట్ల మందే వెళ్లారని మీడియా కన్సల్టింగ్​ సంస్థ ‘ఒర్మాక్స్’ ​ స్టడీలో వెల్లడైంది. ఓటీటీలకు జనం అలవాటుపడినందు వల్లే ఈవిధంగా ట్రెండ్​ మారిందని సినీరంగ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్టడీలో భాగంగా దేశంలోని అర్బన్​, రూరల్​ ప్రాంతాలకు చెందిన 15 వేల మంది సినిమా ప్రేక్షకులను సర్వే చేశారు. వారు ఇచ్చిన వివరాలతో  ‘సైజింగ్​ ది సినిమా 2023’  పేరిట స్టడీ రిపోర్టును రూపొందించారు. థియేటర్లకు వెళ్లే  ప్రేక్షకుల్లో పురుషులు, స్త్రీలు ఎంతమంది ? వారి వయసులు ఎంత ? ఏయే ప్రాంతాల వారు ? ఏయే భాషల సినిమాలు చూస్తారు ? వంటి సమగ్ర వివరాలను  సేకరించి ఈ రిపోర్టులో పొందుపరిచారు. 

2023పైనే మూవీ ఇండస్ట్రీ ఆశలు

ఇండియాలోని థియేటర్​ ఇండస్ట్రీ పెద్దదని, దీనికి క్వాలిటీ డేటా అవసరమని ఒర్మాక్స్​ మీడియా పార్ట్​నర్​ గౌతమ్​ జైన్​ చెప్పారు. ఇప్పటిదాకా సాధారణమైన డేటా మాత్రమే అందుబాటులో ఉంటోందని పేర్కొన్నారు. వివిధ లాంగ్వేజెస్​ ఉన్న మన దేశంలో క్వాలిటీ  డేటా అందుబాటులో లేకపోవడం లోపమే అవుతుందన్నారు. మూవీ ఇండస్ట్రీలోని ఇన్వెస్టర్లు, స్టూడియోలు, ఇండిపెండెంట్​ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటర్లు, ఎగ్జిబిటర్లకు క్వాలిటీ డేటా ఎంతో సాయపడుతుందని జైన్​ వివరించారు. ఈనేపథ్యంలో 2023 సంవత్సరంపై మూవీ ఇండస్ట్రీ గంపెడు ఆశలు పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

తెలుగు ప్రేక్షకులు 3.04 కోట్ల నుంచి 2.8 కోట్లకు డౌన్​ 

2022 సంవత్సరంలో టాలీవుడ్​ ఇండస్ట్రీకి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ​ మంచి సక్సెస్​ను ఇచ్చింది. అయినా గతేడాది  తెలుగు సినిమా ఇండస్ట్రీ 7.8 శాతం మంది ప్రేక్షకులను పోగొట్టుకుంది. అంతకుముందు 3.04 కోట్ల మంది తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూసేవారు. 2022లో ఈ సంఖ్య 2.8 కోట్లకు పడిపోయింది. దేశంలో ఎక్కువ మంది మూవీ లవర్స్​ హిందీ లాంగ్వేజ్​ సినిమాలనే చూస్తున్నారు. కరోనాకు ముందు 5.8 కోట్ల మంది ప్రేక్షకులు హిందీ సినిమాలకు వెళ్లేవారని..ఇప్పుడు వారి సంఖ్య 21.5 శాతం తగ్గిపోయిందని ఒర్మాక్స్​ వెల్లడించింది.

తమిళ సినిమా ప్రేక్షకుల సంఖ్యలో పెద్దగా మార్పు జరగలేదు. ఇది 2.82 కోట్ల వద్ద నిలకడగా ఉందని స్టడీలో వెల్లడైంది. ఇక ఇదే సమయంలో మన దేశంలో హాలీవుడ్​మూవీస్​ కు క్రేజ్​ బాగా పెరిగింది. హాలీవుడ్​ సినిమాలను థియేటర్లలో చూసే వారి సంఖ్య 10.1 శాతం పెరిగి 2.42 కోట్లకు చేరింది. దక్షిణాది లాంగ్వేజెస్​ మూవీస్​సైతం నిలకడగా గ్రోత్​ సాధించాయి. ప్రత్యేకించి కన్నడ సినిమాలైతే  ప్రేక్షకులను 25 శాతం పెంచుకోగలిగాయి. కన్నడ మూవీస్​ చూసేందుకు థియేటర్లకు వెళ్లే  ప్రేక్షకుల సంఖ్య  1.16 కోట్ల నుంచి 1.45 కోట్లకు పెరిగిందని ‘ఒర్మాక్స్’ పేర్కొంది.