V6 News

పాకిస్తాన్లో అంతర్గత విభజన.. 1971 తర్వాత మరోసారి సంక్షోభం దిశగా దాయాది దేశం

పాకిస్తాన్లో అంతర్గత విభజన.. 1971 తర్వాత మరోసారి సంక్షోభం దిశగా దాయాది దేశం

ఎప్పుడూ బాంబుల మోతలు, కర్ఫ్యూలతో అల్లకల్లోలంగా కనిపించే పాకిస్తాన్.. అంతర్గత విభజనకు సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. 1971 విభజన చేసిన గాయాలు, జ్ఞాపకాలు ఒకవైపు వెక్కిరిస్తున్న తరుణంలో మరోసారి విభజన దిశగా పడుతున్న అడుగులు ఆ దేశాన్ని మరింత దివాళా తీస్తుందనే హెచ్చరికలు ఉన్న వేళ.. దేశంలో మరిన్ని ప్రావిన్సుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

1971 దేశ విభజనకూ, ప్రస్తుతం ఆ దేశం ప్రతిపాదిస్తున్న విభజనకూ చాలా తేడా ఉంది. అప్పటి తూర్పు ఫ్రావిన్సు ప్రాంతమైన బంగ్లాదేశ్ పెద్ద యుద్ధం చేసి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. కానీ ప్రస్తుతం తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ లాంటి ప్రాంతాలు ఉద్యమిస్తున్న వేళ.. ప్రావిన్సుల ఏర్పాటుతో చెక్ పెట్టాలనుకుంటున్న పాక్ నిర్ణయాన్ని అంతర్జాతీయ సంస్థలు, మేధావులు, నిపుణులు తప్పుపడుతున్నారు. 

ఆదివారం (డిసెంబర్ 07) పాకిస్తాన్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి అబ్దుల్ అలీం ఖాన్ మాట్లాడుతూ.. చిన్న చిన్న ప్రావిన్సులను తప్పకుండా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ నిర్ణయం సుపరిపాలనకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు జియో టీవీ (Geo TV) తో మాట్లాడుతూ తెలిపారు. 

ప్రావిన్సుల ఏర్పాటు పాక్కు మరింత నష్టం:

పాక్ నిర్ణయాన్ని మేధావులు, ఎక్స్ పర్ట్స్ తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయం దేశాన్ని మరింత డ్యామేజ్ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

దశాబాద్దాల కాలంగా దేశంలో మరిన్ని ప్రావిన్స్ ల ఏర్పాటుపై చర్చ నడుస్తూనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన 1947 లో 5 ప్రావిన్సులు ఉండేవి. తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పంజాబ్, సింధ్, నార్త్-వెస్ట్ ఫ్రంటిర్ ప్రావిన్స్ (NWFP), బలూచిస్తాన్. అయితే ఈస్ట్ బెంగాల్ 1971 యుద్ధం తర్వాత విడిపోయి బంగ్లాదేశ్ గా అవతరించింది. వెస్ట్ పంజాబ్ పంజాబ్ గా మారింది. NWFP ఖైబర్ పఖ్తుంఖ్వాగా మారింది. సింధు, బలూచిస్తాన్ లు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. 

బలూచిస్తాన్,ఖైబర్ లతో తలనొప్పి.. అయినా ప్రావిన్స్ ల ఏర్పాటు దిశగా పాక్:

ఒకవైపు బలూచిస్తాన్ తమకు స్వతంత్ర్య దేశం కావాలని ఉద్యమం చేస్తోంది. ఒకప్పటి శాంతియుత ఉద్యమం చాలా రోజులుగా హింసాత్మక మార్గంలో సాగుతోంది. అటు ఖైబర్ పఖ్తుంఖ్వాలో (ఖైబర్ కనుమలు) కూడా ఇదే హింసాత్మక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. 

ఈ పరిస్థితుల్లో ఎన్నో చర్చలు, సెమినార్లు, డిబేట్ల తర్వాత పాక్ ను మరిన్ని ప్రావిన్సులుగా విడగొట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు అద్బుల్ అలీం ఖాన్ ప్రకటించారు. దీని ద్వారా పరిపాలన కంట్రోల్ లోకి వస్తుందని పేర్కొన్నారు. 

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మధ్య సాగుతున్న పరిపాలన విభజన, ఆధిపత్య పోరులో ఆ దేశంలో స్వాతంత్ర్యం కావాలనే ప్రావిన్సుల పోరు మరింత ఉధృతంగా మారింది. 

ఒక్కో ప్రావిన్స్ మూడు ప్రావిన్సులుగా:

ప్రస్తుతం ఉన్న ప్రావిన్సులను ఒక్కో దాన్ని మూడు ప్రావిన్సులుగా విభజించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సింధు, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ లను ఒక్కో దాన్ని మూడు ప్రావిన్సులుగా డివైడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.  మా చుట్టు పక్కల ఉన్న దేశాలలో చాలా చిన్న చిన్న ప్రావిన్సులు, రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మేము చేసే విభజన పెద్ద విషయం కాదని అలీం ఖాన్ పేర్కొన్నారు. 

పాక్ మరింత సంక్షోభంలోకి:

ప్రభుత్వ నిర్ణయం ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాక్ అంతర్గత సంక్షోభానికి ప్రావిన్సుల విభజన పరిష్కారం కాదని మాజీ పాకిస్తాన్ ప్రభుత్వాధికారి సయిద్ అక్తర్ అలా షా అన్నారు. దేశంలో రాజ్యాంగ, పాలన, చారిత్రాత్మకమైన సమీక్ష జరగాల్సి ఉందన్నారు.

పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రావిన్సుల సంఖ్య కాదు, పాలనలో అంతరాలు అని ఆయన అన్నారు. బలహీనమైన సంస్థలు, అమలు జరిగే తీరు సరిగా లేకపోవడం, జవాబుదారీతనం లేకపోవడం దేశాన్ని దెబ్బతీశాయని అన్నారు. కేవలం ప్రావిన్సులనుపెంచడం వల్ల ఈ ప్రాథమిక సమస్యలు పరిష్కారం కావని హెచ్చరించారు.  - 

పాకిస్తాన్‌కు చెందిన థింక్ ట్యాంక్, పిల్దత్ అధ్యక్షుడు అహ్మద్ బిలాల్ మెహబూబ్ కూడా గతంలో పరిపాలనా పునర్నిర్మాణ ప్రయోగాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత కొత్త ప్రావిన్సులను పెంచడం దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని అన్నారు. 

స్థానికంగా అధికారాల వికేంద్రీకరణ లేకపోవడం.. అంటే పాలన అంతా కేంద్రంలో కేంద్రీకృతం అవ్వడం వలన నష్టాలే తప్ప లాభాలు లేవని.. డాన్ పత్రికలో వ్యాసంలో పేర్కొన్నారు. స్థానిక పాలన కంటే పెద్ద ప్రావిన్సులు పెద్ద సమస్య కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  రాజ్యాంగానికి అనుగుణంగా ప్రస్తుత పరిపాలనా విభాగాలను శక్తివంతం చేయడం, స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని మేధావులు సూచిస్తున్నారు. కొత్త రాష్ట్రాలను విభజించానే ముందు ప్రస్తుత సమస్యలను పరిష్కరించకపోతే పరిస్థితిని మరింతగా దిగజార్చుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.