లేహ్: పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో తలుచుకుంటే ఇంకా ఎక్కువ విధ్వంసమే చేసి ఉండేవాళ్లమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. కానీ.. మన సైన్యం సంయమనం పాటించిందని, క్రమశిక్షణతో వ్వవహరించి అవసరమైన చర్యలు మాత్రమే తీసుకున్నదని తెలిపారు. ఉగ్రవాద ముప్పును తీవ్రతరం చేయకుండా గట్టి బుద్ధి చెప్పిందని అన్నారు.
దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో రూ.5వేల కోట్లతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) నిర్మించిన 125 ప్రాజెక్టులను రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ప్రారంభించారు. లడఖ్, జమ్మూ కాశ్మీర్‌తోపాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, వెస్ట్ బెంగాల్, మిజోరంలలో 28 రోడ్లు, 93 బ్రిడ్జీలు, మరో 4 ఇతర ప్రాజెక్టులను బీఆర్‌వో నిర్మించింది. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన గల్వాన్ యుద్ధస్మారకాన్ని రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు.
వీటిని జాతిక అంకితం చేసిన అనంతరం.. లేహ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మన బలగాలు, ప్రభుత్వాలు, సరిహద్దు ప్రాంతాల ప్రజల మధ్య మేం చూసిన సమన్వయం అద్భుతమైనది. మన సాయుధ దళాలకు మద్దతు ఇచ్చినందుకు లడఖ్‌లోని ప్రతి పౌరుడికి, సరిహద్దు ప్రాంతాల ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని పేర్కొన్నారు.
బోర్డర్‌లో మౌలిక సదుపాయాల కల్పన
బోర్డర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. కనెక్టివిటీ అనేది కేవలం రోడ్లు లేదా నెట్‌వర్క్‌లు మాత్రమే కాదని, అది దేశ భద్రతకు వెన్నెముక అని పేర్కొన్నారు. మన సైనికుల శౌర్యం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి అని, దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ఈ అభివృద్ధి ప్రాజెక్టులు అంకితమని చెప్పారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసినందుకు ‘బీఆర్‌వో’ను రాజ్‌నాథ్ అభినందించారు.
రక్షణ ఉత్పత్తిలో రికార్డులు
గతంలో ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్.. ఇప్పుడు ఉత్పత్తి, ఎగుమతి దేశంగా మారుతోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 2014లో రూ. 46 వేల కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తి.. ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ. 1.51 లక్షల కోట్లకు చేరిందని వివరించారు.
పదేండ్ల క్రితం రూ. వెయ్యి కోట్లలోపు ఉన్న రక్షణ ఎగుమతులు.. ఇప్పుడు రూ.24 వేల కోట్లకు చేరాయన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్‌తో కలిసి బీఆర్‌వో అభివృద్ధి చేసిన ‘క్లాస్-70 మాడ్యులర్ బ్రిడ్జి’లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ భద్రతలో బీఆర్‌ఓ పాత్రను గుర్తించి.. 2025–-26 బడ్జెట్‌లో వారికి కేటాయింపులను రూ.7,146 కోట్లకు పెంచినట్లు తెలిపారు.
