వాషింగ్టన్: ఇండియాపై ఇప్పటికే 50 శాతం అదనపు వాణిజ్య సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యారు. భారత బియ్యం ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తామని ఆయన సంకేతాలిచ్చారు. సోమవారం (డిసెంబర్ 8) వైట్‌హౌస్‌లో అమెరికన్ రైస్ రైతులతో ట్రంప్ సమావేశమయ్యారు. భారతదేశం, వియత్నాం, థాయిలాండ్ చైనా వంటి దేశాల నుంచి అమెరికా చేసుకుంటున్న బియ్యం దిగుమతులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆయా దేశాలు అమెరికాలో బియ్యాన్ని భారీగా డంప్ చేస్తున్నాయని రైతులు చెప్పారు. వెంటనే స్పందించిన ట్రంప్.. అమెరికాలో బియ్యం డంప్ చేయడానికి ఇండియాకు అనుమతి ఉందా..? బియ్యం ఎగుమతులపై భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఏమైనా ఉందా అని అధికారులను ప్రశ్నించారు. ఇండియాకు అలాంటి ప్రత్యేక అనుమతి ఏమి లేదని.. ఆ దేశంతో ట్రేడ్ డీల్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అధికారులు సమాధానమిచ్చారు.
అలాంటప్పుడు ఇండియా తన బియ్యాన్ని అమెరికాలో డంప్ చేయడానికి అనుమతించకూడదని.. న్యూఢిల్లీపై అదనపు సుంకాలు విధించాలని ట్రంప్ సూచించారు. ఇక నుంచి భారత్ అమెరికాలో బియ్యం డంపింగ్ చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. కెనడా నుండి వచ్చే ఎరువులపైన భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ తెలిపాడు. విదేశాల నుంచి దిగుమతులతో తీవ్ర నష్టాలను చవిచూస్తోన్న అమెరికన్ రైతులకు ఈ సందర్భంగా 12 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించారు ట్రంప్.
కాగా, రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాపై సుంకాల మోత మోగిస్తున్నాడు ట్రంప్. 25 శాతం ప్రతీకార సుంకాలు, రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోందన్న సాకుతో మరో 25 శాతం.. మొత్తం ఇండియాపై 50 శాతం ట్రేడ్ టారిఫ్స్ విధించాడు ట్రంప్. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కీలక దశలో ఉన్న వేళ భారత బియ్యం దిగుమతులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ సంకేతాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.

